రాజ‌ధానిలో టీడీపీ ప‌ట్టు స‌డ‌లుతోందిగా..

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో రోజు రోజుకు టీడీపీ గ్రాఫ్ త‌గ్గుతోందా ? అక్క‌డ రైతుల నుంచి బ‌ల‌వంతపు భూసేక‌ర‌ణ, ప్ర‌జ‌ల‌కు క‌నీస సౌక‌ర్యాల క‌ల్ప‌న‌లో ప్ర‌భుత్వ వైఫ‌ల్యం, అక్క‌డ సామాన్య జ‌నాల ఇబ్బందులు అడుగ‌డుగునా కొట్టొచ్చిన‌ట్టు క‌న‌ప‌డుతున్నాయి. అయితే ఇదంతా పైకి మాత్ర‌మే క‌న‌ప‌డుతోన్న వ్య‌తిరేక‌త‌…అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వ్య‌తిరేక‌త‌ను అధికారంలో ఉంది కాబ‌ట్టి టీడీపీ ఏదోలా మేనేజ్ చేసుకుంటూ క‌వ‌రేజ్ చేసేసింది.

అయితే ఇది ఓట్ల రూపంలో వ్య‌తిరేకంగా వ‌స్తే ఇక క‌వరేజ్ చేసుకోవ‌డానికి ఏం ఉంటుంది…దాన్ని ఎవ్వ‌రూ దాచిపెట్ట‌లేరు క‌దా…! ఇప్పుడు క‌రెక్టుగా అదే జ‌రిగింది. ఏపీలోని వివిధ మునిసిపాలిటీల్లో వార్డుల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలున్న మునిసిపాలిటీల్లో సైతం టీడీపీ అభ్య‌ర్థులు గెలిచారు. అయితే రాజ‌ధాని ప్రాంతానికి కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి మునిసిపాలిటీలో 31 వార్డుకు జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాత్రం వైసీపీ ఘ‌న‌విజ‌యం సాధించింది.

మంగ‌ళ‌వారం వెలువ‌డిన ఫ‌లితాల్లో టీడీపీ అభ్యర్ధి దర్నాసి రాజారావుపై వైసీపీ అభ్యర్ధి మేరుగమల్లి వెంకటరమణ 153 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ సీటును వైసీపీ కైవసం చేసుకోవడంతో టీడీపీ నాయకులు అయోమయంలో పడ్డారు. ఏపీ వ్యాప్తంగా అన్ని చోట్లా జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిస్తే రాజ‌ధాని ప్రాంతంలో జ‌రిగిన ఇక్క‌డ మాత్రం టీడీపీ ఓడిపోవ‌డం ఆ పార్టీకి మింగుడు ప‌డ‌డం లేదు.

ఇక ఇక్క‌డ మునిసిపాలిటీ కూడా టీడీపీ చేతిలోనే ఉంది. 2014 ఎన్నికల్లో ఈ వార్డు నుంచి కౌన్సిలరుగా గెలుపొందిన టీడీపీ అభ్యర్థి మురళీకృష్ణ వ్యక్తిగత రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నిక ఫ‌లితం బ‌ట్టి రాజ‌ధాని ప్రాంతంలో రోజు రోజుకు టీడీపీ గ్రాఫ్ త‌గ్గుతోంద‌ని ఈ ఫ‌లితాలే చెపుతున్నాయ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.