ల‌గ‌డ‌పాటి రూటు టీడీపీనా..? వైసీపీనా..?

విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్ పేరు చెపితేనే మ‌న‌కు ర‌గ‌డపాటి అన్న క్యాప్ష‌న్ గుర్తుకు వ‌స్తుంది. రాష్ట్ర విభ‌జ‌న జ‌రుగుతున్న‌ప్పుడు పార్ల‌మెంటులో పెప్ప‌ర్ స్ప్రేతో నానా హ‌డావిడి చేసిన రాజ్‌గోపాల్ స‌ర్వేల‌కు పెట్టింది పేరు… రాజ్‌గోపాల్ స‌ర్వే అంటే కాస్త అటూ ఇటూగా తుది ఫ‌లితానికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌న్న విష‌యం చాలాసార్లు రుజువైంది. ఇక రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాజ్‌గోపాల్ కాంగ్రెస్‌కు దూర‌మై రాజ‌కీయంగా క్రియాశీల‌కంగా లేరు.

ఇక కొద్ది రోజులుగా రాజ్‌గోపాల్ పొలిటిక‌ల్ రీ ఎంట్రీపై ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ల‌గ‌డ‌పాటి వైసీపీలో జాయిన్ అవుతున్నార‌ని, కృష్ణా జిల్లాలోని మైల‌వ‌రం సీటు నుంచి ఆయ‌న ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే ల‌గ‌డ‌పాటి జిల్లాలో ఏదో ఒక కొత్త నియోజ‌క‌వ‌ర్గం లేదా ప్ర‌స్తుతం ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలే ఉంటే మైల‌వ‌రం నుంచి ఇరిగేష‌న్ మినిస్ట‌ర్ దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుపై ఆయ‌న బ‌రిలోకి దిగుతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ వార్త‌ల సంగ‌తి ఇలా ఉంటే ఆయ‌న కొద్ది రోజుల క్రితం వెల‌గ‌పూడిలో ఏపీ సీఎం చంద్ర‌బాబుతో ఏకంగా 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. దీంతో ల‌గ‌డ‌పాటి టీడీపీలో కూడా చేర‌తార‌న్న మ‌రో ప్ర‌చార‌మూ ఉంది. కేశినేని నాని విష‌యంలో అసంతృప్తితో ఉన్న చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ల‌గ‌డ‌పాటిని లైన్లో పెడుతున్నార‌న్న గుస‌గుస‌లు వినిపించాయి. ఇక ల‌గ‌డ‌పాటి త‌న ప్లాస్ టీంతో స‌ర్వే చేయించి….వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ టీడీపీ గెలుస్తుంద‌ని చంద్ర‌బాబుకు సర్వే రిపోర్ట్ ఇచ్చార‌న్న స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఏదేమైనా ల‌గ‌డ‌పాటి పొలిటిక‌ల్ రీ ఎంట్రీ ఏ పార్టీ ద్వారా జ‌రిగినా కృష్ణా జిల్లాలో ఆయా పార్టీల్లో ఉన్న కీల‌క నాయ‌కుల‌కు ఎర్త్ త‌ప్ప‌దు. అటు ప్ర‌త్య‌ర్థుల‌కు సైతం ఆయ‌న ధీటైన ప్ర‌త్య‌ర్థిగా నిలుస్తాడ‌నంలో డౌట్ లేదు.