`ప‌శ్చిమ‌`లో మంత్రి వర్సెస్ జెడ్పీ చైర్మ‌న్‌

టీడీపీ, బీజేపీ మ‌ధ్య అంత‌ర్గ‌తంగా ఉన్న విభేదాలు మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చాయి. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన నాటి నుంచి బీజేపీ, టీడీపీ నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌డం లేద‌నే  విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ముఖ్యంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఇవి మ‌రింత ముదిరిపోయాయి.  మంత్రి, జెడ్పీ చైర్మ‌న్ మ‌ధ్య జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల విష‌యంలో వివాదం చెల‌రేగింది. వార‌స‌త్వ సంప‌ద‌గా తీర్చుదిద్ద‌తామ‌ని ఒక‌రు.. పాఠ‌శాల చుట్టూ వాణిజ్య స‌ముదాయం నిర్మించి అభివృద్ధి చేస్తామ‌ని మ‌రొక‌రు ఇలా.. మంకు ప‌ట్టుతో ఉన్నారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు ప్రజా ప్రతినిధులు రెండు భిన్నమైన ప్రకటనలు చేయ‌డ‌టంతో ప్ర‌జ‌లు విస్మ‌యం వ్య‌క్తంచేస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా ఉన్న జిల్లా పరిషత్ భూముల్లో వాణిజ్య సముదాయాలను నిర్మించి ఆదాయం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాడేపల్లిగూడెంతోపాటు, నల్లజర్ల తదితర ప్రాంతాల్లో జిల్లా పరిషత్ పాఠశాలల చుట్టూ వాణిజ్య సముదాయాలను నిర్మించాలని జిల్లా పరిషత్ చైర్మన బాపిరాజు నిర్ణయించారు. ఇందుకోసం చైర్మన్‌ బాపిరాజు శంకుస్థాపన చేశారు. జిల్లా పరిషత్‌ నిధులతో నిర్మించాలని, అద్దెల రూపంలో వచ్చే ఆదాయంలో 20 శాతం జిల్లా పరిషత పాఠశాలకు అప్పగించేలా నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఏటా రూ.8 లక్షల‌ ఆదాయం లభిస్తుందని అంచనా వేశారు. దీంతో ఆంగ్ల మాద్యమాన్ని అమలు చేయవచ్చని బాపిరాజు ప్రకటించారు.

శంకుస్థాపన పూర్తయిన ఆరు నెలల తర్వాత జిల్లా పరిషత పాఠశాల పరిరక్షణ విషయం తెరపైకి వచ్చింది. పూర్వ విద్యార్థులు అక్కడ నిరసన దీక్ష చేపట్టారు. దీనికి మంత్రి మాణిక్యాలరావు మద్దతు తెలిపారు. పూర్వ విద్యార్థుల ఆకాంక్షల మేరకు జిల్లా పరిషత పాఠశాలను వారసత్వ సంపదగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాన్ని పునర్నిర్మించి విద్యుత కాంతులను ఏర్పాటు చేస్తామని వివరించారు. మిత్రపక్షంగా ఉంటూ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి మాణిక్యాలరావు దీక్షకు మద్దతు తెలపడాన్ని బాపిరాజు తప్పుపట్టారు.

వారం రోజుల వ్యవధిలోనే ఈ ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య రెండు భిన్నమైన వాదనలు వెలువడ్డాయి. దీంతో పట్టణ ప్రజల మధ్య అయోమయం నెలకొంది. ఒకే ప్రభుత్వంలో ఉంటూ ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఇలా వేర్వేరు దృక్పథాలతో పయనించడంతో  వారంతా విస్మ‌యం వ్య‌క్తంచేస్తున్నారు. మ‌రి ఈవివాదం ఇప్ప‌టికైనా ముగుస్తుంతో లేక‌.. ఎక్క‌డి వ‌ర‌కూ వెళుతుందోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.