టీడీపీలో అస‌మ్మ‌తి, అసంతృప్తికి కార‌ణ‌మిదేనా..!

అస‌మ్మ‌తి, అసంతృప్తికి ఆమ‌డ దూరంలో ఉంటే టీడీపీ నాయ‌కులు.. ఈ మ‌ధ్య త‌మ ఆవేద‌న, ఆక్రంద‌న‌ను బాహాటంగా వినిపిస్తున్నారు. వ్య‌క్తుల కంటే పార్టీ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని.. క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పితే ఉపేక్షించేది లేద‌ని అధినేత చంద్ర‌బాబు ప‌దేప‌దే స్ప‌ష్టంచేస్తున్న కొద్దీ.. పార్టీలో అసంతృప్తులు స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు. మంత్రి వ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌తో మొద‌లైన ఈ అసంతృప్తి జ్వాల‌లు ఇంకా చ‌ల్లార‌లేదు. పైగా ఇంకా ఇంకా ర‌గులుతూనే ఉన్నాయి. ద‌ళితుల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతోంద‌ని సాక్షాత్తూ  చిత్తూరు ఎంపీ శివప్ర‌సాద్ చేసిన వ్యాఖ్య‌లు పార్టీలో క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి.

టీడీపీ నేత‌లు సొంత పార్టీపైనే నిర‌స‌న గ‌ళం ఎక్కుపెడుతున్నారు. ఏపీ తెలుగుదేశంలో అసంతృప్తి గళాలు ఓ రేంజ్‌లో వినిపిస్తున్నాయి. స‌మ‌స్య‌లు ఉంటే అధినేతతో చ‌ర్చించి.. ప‌రిష్క‌రించుకోవాలి. కానీ టీడీపీలో ఇలాంటి ప‌రిస్థితి కనిపించ‌డం లేదు. నిన్నటిదాకా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అసంతృప్తి ర‌గిలింది. త‌మ‌కు ప‌ద‌వులు ద‌క్క‌ని నేత‌లు పార్టీపై విమ‌ర్శ‌లు చేశార‌ని అనుకున్నా..  నిన్న కేశినేని నాని, నేడు చిత్తూరు ఎంపీ చేసిన వ్యాఖ్య‌ల వెనుక గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. అయితే వీరు చేస్తున్న వ్యాఖ్య‌లు పార్టీలో దుమారం రేపుతున్నాయి.

ఎస్సీల స‌బ్ ప్లాన్ నిధులు, మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో అన్యాయం జ‌రిగింద‌ని ప్ర‌భుత్వంపై శివ‌ప్ర‌సాద్‌ తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. రాయ‌ల‌సీమ‌కు కూడా అన్యాయం జ‌రిగింద‌ని, ద‌ళితుల‌కు కేవ‌లం రెండు మంత్రి ప‌దువు లు ఇచ్చి చేతులు దులుపుకున్నార‌ని, ఐదు మంత్రి ప‌దవులు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై  మంత్రి న‌క్కా ఆనంద్ బాబు స్పందించారు. వ్య‌క్తిగ‌త ఎజెండాను ప‌క్క‌న పెట్టాల‌ని సూచించారు. రాజ‌కీయ విమ‌ర్శ‌లు మానుకోవాల‌ని, లేని ప‌క్షంలో త‌గిన బుద్ధి చెబుతామ‌ని న‌క్కా ఆనంద్ బాబు కౌంట‌ర్ ఇచ్చారు.  ఏ ప్రాంతాన్నీవిడ‌దీసి చూడ‌లేమ‌న్నారు.

విజయవాడ రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన రగడ అనంత‌రం కేశినేని నాని మాట్లాడుతూ అధికారంలో ఉన్నామనే పేరు తప్పా.. అధికారులెవ్వరూ తమ మాట వినే పరిస్థితి లేకుండా పోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ నేత‌ల అసంతృప్తికి అధికారులతో త‌మ పనులు చేయించుకోలేక‌పోవ‌ట‌మేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంత‌ర్గ‌తంగా విశ్లేషిస్తున్నారు. దీంతో ప్ర‌భుత్వంపైనే విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టి త‌మ అస‌హ‌నాన్ని వెళ్ల‌గ‌క్కుతున్నార‌ని చెబుతున్నారు.