తెలంగాణ‌లో బ‌ద్ధ‌శ‌త్రువుతో టీటీడీపీ దోస్తీ ..!

కొత్త మిత్రుడి కోసం టీటీడీపీ వెదుకులాట ప్రారంభించింది. ప్ర‌స్తుతం బీజేపీతో మైత్రి కొన‌సాగుతున్నా.. ఎప్పుడు క‌మ‌ల‌నాథులు క‌టీఫ్ చెప్పేస్తారో తెలియ‌ని ప‌రిస్థితి. దీంతో త‌మ మ‌నుగ‌డ కాపాడుకునేందుకు స‌రికొత్త పొత్తుల కోసం చ‌ర్చ‌లు ప్రారంభించింది. ఇందులో భాగంగా.. శ‌త్రువుల‌తోనూ చేతులు క‌లిపేందుకు సిద్ధ‌మ‌ని సంకేతాలు ఇస్తోంది. అంతేగాక మ‌రో అడుగు ముందుకేసి చ‌ర్చ‌లు కూడా ప్రారంభించింద‌ని స‌మాచారం! శ‌త్రువుకు శ‌త్రువు మిత్రుడు అనే సూత్రాన్ని పాటించాల‌ని డిసైడ్ అయిపోయింది. అందుకే బ‌ద్ధ‌శ‌త్రువైన కాంగ్రెస్‌తో కూడా దోస్త్ మేరా దోస్త్ అంటూ గీతం పాడేందుకు చ‌ర్చ‌లు జ‌రుపుతోంద‌ని స‌మాచారం!

ఒక ప‌క్క సీఎం కేసీఆర్‌.. ముంద‌స్తు ఎన్నిక‌లు అంటూ సంకేతాలు ఇచ్చేస్తున్నారు. అందుకు త‌గిన‌ట్టుగానే రైతులు, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌పై వ‌రాల జ‌ల్లులు కురిపిస్తున్నారు. ఓరుగల్లు సభను ఎన్నికల సభగా మార్చారు. ఇక ఎన్నికల ఫీవ‌ర్ రాష్ట్రంలో మొద‌ల‌వ‌బోతోంద‌నే సంకేతాలు ఇచ్చేస్తున్నారు. కేసీఆర్ ఎవ‌రికీ అంద‌నంత వేగంగా దూసుకుపోతుంటే.. ప్ర‌తిప‌క్షాలు పొత్తుల వేట‌లో ప‌డ్డాయి. అంద‌రి ల‌క్ష్యం ఒక్క‌టే అయినా.. వేరువేరుగా ఇప్ప‌టివ‌ర‌కూ పోరాడుతున్నారు. అందుకే క‌లిసిక‌ట్టుగా పోరాడాల‌నే నిర్ణ‌యానికి  ఈ పార్టీల‌న్నీ వ‌చ్చేశాయి. ముఖ్యంగా టీడీపీ ఈ విష‌యంలో కొంత ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది.

ఏపీలో బీజేపీతో దోస్తీ టీడీపీకి లాభించినా.. తెలంగాణలో మాత్రం విరుద్దంగా జరిగింది. టీడీపీ నేతలను తెలంగాణ బీజేపీ నేతలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఉమ్మడి శత్రువు టీఆర్ఎస్ పై పోరు చేసేందుకు ఆ పార్టీ నేతలు కలిసి రావడం లేదు. దీంతో టీటీడీపీ ఒంటరిగానే కేసీఆర్ సర్కారుపై పోరాటం చేస్తోంది. అందుకే కాంగ్రెస్ తో దోస్తీ కట్టేందుకు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ విష‌యంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో టీడీపీ నేత రేవంత్ రెడ్డి మంతనాలు జరిపినట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీ వైఖరి పై అసంతృప్తిగా ఉన్న నేతలు విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదంటున్నారు.

కాంగ్రెస్ కు వ్యతిరేకంంగా పుట్టిన పార్టీ టీడీపీ. తెలుగునాట హస్తం గుర్తును చెరిపేసి విజయభేరి మోగించిన పార్టీ. కానీ తెలంగాణలో ఆ పార్టీ ఉనికే లేకుండా పోయింది. కేవ‌లం ముగ్గురంటే ముగ్గురే ఇప్పుడు ఆ పార్టీకి మిగిలారు. పూర్తిగా ఆ పార్టీ పరిస్థితి దిగజారకుండా ఉండాలంటే పొత్తులు పెట్టుకోక తప్పని స్థితి. గ‌త‌ ఎన్నికల్లో కమలం పార్టీతో చేతులు కలిపింది టీడీపీ. కానీ అది పెద్దగా అచ్చి రాలేదు. టీఆర్ఎస్ ను ఓడించాలంటే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలతో పాటు కామ్రేడ్స్ ను కలుపుకు పోయేందుకు విపక్షాలు సిద్దమవుతున్నాయి. మ‌రి వీరి పొత్తులు ఫ‌లిస్తాయో లేదో!!