టీడీపీకి రావెల గుడ్ బై..! ఏపీ బీఎస్పీ అధ్యక్ష పదవికి చూపు

ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో ఉద్వాస‌న‌కు గురైన గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి రావెల కిషోర్‌బాబు టీడీపీకి గుడ్ బై చెప్ప‌నున్నాడా ? మంత్రి ప‌ద‌వి నుంచి త‌న‌ను త‌ప్పిస్తార‌ని ముందే ఊహించిన రావెల ఈ మేర‌కు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయేందుకు ప్ర‌ణాళిక‌లు వేసుకున్నాడా ? అంటే ఏపీ ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు సీఎం చంద్ర‌బాబుకు అందించిన నివేదిక ప్ర‌కారం అవున‌నే ఆన్స‌రే వ‌స్తోంది.

కేంద్ర స‌ర్వీసుల్లో ప‌నిచేసిన రావెల కిషోర్‌బాబుకు చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు అసెంబ్లీ సీటు ఇచ్చారు. తొలిసారి గెలిచిన ఆయ‌న‌కు అనూహ్యంగా బాబు కేబినెట్‌లో చోటు ద‌క్కించుకున్నారు. అయితే ఆయ‌న ప‌నితీరు చాలా అధ్వానంగా ఉంది. శాఖ‌లో ప‌ట్టులేని రావెల వ‌ల్ల కీల‌క‌మైన గుంటూరు జిల్లాలో కాదు క‌దా క‌నీసం ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్న ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలో కూడా పార్టీకి ఉప‌యోగం లేకుండా పోయింది.

ఆయ‌న ఇద్ద‌రు కుమారులు వివాదాల్లో చిక్కుకుని పార్టీకి చెడ్డ‌పేరు తెచ్చారు. త‌ర్వాత బీజేపీతో పొత్తుపై కూడా ఆయ‌న చేసిన కాంట్ర‌వ‌ర్సీ కామెంట్ల‌తో బాబు ఆయ‌న‌కు వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ జానీమూన్‌తో గొడ‌వ‌, నియోజ‌క‌వ‌ర్గంలోను, జిల్లాలోను పార్టీలో ఎప్ప‌టి నుంచో ఉన్న సీనియ‌ర్ల‌ను అస్స‌లు గౌర‌వించ‌క‌పోవ‌డం, తాను మంత్రినే కాదు గ‌తంలో అధికారిగా ప‌నిచేశాన‌న్న ద‌ర్పం ప్ర‌ద‌ర్శించ‌డంతో చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చారు. అయినా ఆయ‌న తీరు మార్చుకోక‌పోవ‌డంతో ప్ర‌క్షాళ‌న‌లో ఫ‌స్ట్ వికెట్ ఆయ‌న‌దే అన్న చర్చ ఎప్ప‌టి నుంచో సాగుతోంది.

ఇదిలా ఉంటే ఉద్వాస‌న త‌ప్ప‌ద‌ని తెలుసుకున్న రావెల కొద్ది రోజుల క్రితం బీఎస్పీ అధినేత్రి మాయ‌వ‌తిని క‌లిసి త‌న‌కు ఏపీ బీఎస్పీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని కోరిన‌ట్టు ఇంటిలిజెన్స్ రిపోర్టు చంద్ర‌బాబు వ‌ద్ద ఉన్న‌ట్టు విశ్వ‌సనీయ‌వ‌ర్గాల స‌మాచారం. రావెల తీరుతో ఇప్ప‌టికే విసిగిపోయిన బాబు ఆయ‌న మాయావ‌తిని క‌ల‌వ‌డంతో ఇక పూర్తిగా ప‌క్క‌న పెట్టేయాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న్ను మంత్రి నుంచి త‌ప్పించాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఇక మంత్రి ప‌ద‌వి నుంచి ఉద్వాస‌న‌కు గురైన రావెల త్వ‌ర‌లోనే టీడీపీకి గుడ్ బై చెపుతార‌ని టాక్‌.