టీటీడీ చైర్మ‌న్‌గా బాబు ఓటు ఆయనకే

టీటీడీ చైర్మ‌న్ ప‌దవికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు జోరుగా లాబీయింగ్ మొద‌లుపెట్టార‌ట‌. శ్రీ‌వారి సేవ‌లో త‌రించాలంటే .. ముందుగా సీఎం చంద్ర‌బాబు ఆశీర్వాదం త‌ప్ప‌నిస‌రి. దీంతో ఇప్పుడు ఈ ప‌ద‌వి ఆశిస్తున్న నేత‌లు.. చంద్ర‌బాబును ప్ర‌సన్నం చేసుకునే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. ఇందులో ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ చంద్ర‌బాబు దృష్టిలో వేరే వ్య‌క్తి పేరు మెద‌లుతోంద‌ట‌. దీంతో ఇక రాయ‌పాటికి ఈసారీ నిరాశే ఎదుర‌వ‌వ‌చ్చ‌నే ప్ర‌చారం వినిపిస్తోంది. ఈసారి ఈప‌ద‌వి వివాద‌ర‌హితుడు, త‌న‌కు స‌న్నిహితుడిగా పేరొందిన ఎంపీ ముర‌ళీమోహ‌న్ వైపే మొగ్గు చూపే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుత టీటీడీ చైర్మ‌న్ చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి ప‌ద‌వీకాలం ముగుస్తోంది. మ‌రోసారి ఆయ‌న‌కు ఈ ప‌ద‌వి ద‌క్క‌డం అనుమాన‌మే! దీంతో ఇప్పుడు కొత్త చైర్మ‌న్ ఎవ‌ర‌నే ప్ర‌శ్న పార్టీలో మొద‌లైంది. ముఖ్యంగా ఇందులో ప‌లువురి పేర్లు తెర‌పైకి వ‌చ్చినా.. టీడీపీ ఎంపీల పేర్లే ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎంపీలు సాంబ‌శివ‌రావు, ముర‌ళీమోహ‌న్‌లు ఎవ‌రి స్థాయిలో వాళ్లు లాబీయింగ్ చేస్తున్నార‌ట‌. అయితే వీరిలో ముర‌ళీమోహ‌న్‌పై చంద్ర‌బాబుకు సాఫ్ట్‌కార్న‌ర్ ఉంద‌ని తెలుస్తోంది.

ముర‌ళీమోహ‌న్‌.. రాజ‌కీయాల‌కు కొత్త అయినా చంద్ర‌బాబుకు స‌న్నిహితుడిగా పేరొందారు. అంతేగాక వివాద‌ర‌హితుడిగా ఉండ‌టం ఆయ‌న‌కు ప్ల‌స్‌! అటు సినీ ఇండ‌స్ట్రీలోనూ, ఇటు రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన ముద్ర‌తో దూసుకుపోతున్నారు. అలాగే ఆయ‌నకు వెంక‌న్న అంటే అమిత‌మైన భ‌క్తి! ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌. ఆయ‌న‌కు అవ‌కాశమివ్వ‌డం ద్వారా.. అర్హుడైన వ్యక్తికి టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చిన‌ట్లు అవుతుంద‌ని ఆయ‌న యోచిస్తున్నార‌ట‌.

ఇక ఈసారీ రాయ‌పాటికి శ్రీ‌నివాసుడి క‌టాక్షం ద‌క్క‌క‌పోవ‌చ్చ‌నే ఊహాగానాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్‌లో ఉన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌న‌.. టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విపై ఆశ‌లుపెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే కొంత అసంతృప్తి చెందిన ఆయ‌న‌.. చంద్ర‌బాబుపై అప్పుడ‌ప్పుడూ ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. దీంతో ఆయ‌న‌కూ, చంద్ర‌బాబుకు మ‌ద్య గ్యాప్ పెరిగింద‌ని స‌మాచారం. దీంతో ముర‌ళీమోహ‌న్‌కే చైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్క‌వ‌చ్చ‌ని పార్టీలో అంత‌ర్గ‌తంగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.