కేబినెట్ నుంచి బాబు విశ్వ‌స‌నీయుడు అవుట్‌..!

ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌ న్యూస్ ఇప్పుడు పెద్ద ఫీవ‌ర్‌లా మారింది. ఈ విస్త‌ర‌ణ‌లో కేబినెట్ నుంచి సీఎం చంద్ర‌బాబుకు గ‌త కొన్ని యేళ్లుగా అత్యంత విశ్వాస‌పాత్రుడిగా, పార్టీకి న‌మ్మ‌క‌స్తుడిగా ఉన్న మంత్రికి ఊస్టింగ్ త‌ప్పేలా లేదు. చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా శ్రీకాళ‌హ‌స్తి నుంచి చాలా యేళ్లుగా ప్రాథినిత్యం వ‌హ‌స్తున్నారు బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి. పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు, సంక్షోభంలోను చంద్ర‌బాబు వెన్నంటే ఉన్న బొజ్జ‌ల‌కు గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం త‌ర్వాత అట‌వీ శాఖా మంత్రి బాధ్య‌త‌లు చంద్ర‌బాబు అప్ప‌గించారు.

బొజ్జ‌ల విష‌యంలో పెద్ద కంప్లెంట్లు ఏమీ లేవు. బొజ్జ‌ల‌ను కేబినెట్ నుంచి త‌ప్పించేందుకు ఎలాంటి రీజ‌న్స్ లేవు. ఆయ‌న సుదీర్ఘ‌కాలం మంత్రిగా ప‌నిచేశారు. అయితే అనారోగ్యం దృష్ట్యా బొజ్జ‌ల ఇటీవ‌ల త‌న శాఖ‌లో చురుగ్గా వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోతున్నారు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ఆయ‌న పార్టీ క్యాడ‌ర్‌కు స‌రిగా అందుబాటులో ఉండ‌లేక‌పోతున్నారు.

చంద్ర‌బాబు ఫోక‌స్ ఎక్కువుగా స్టేట్ మీద ఉండ‌డంతో చిత్తూరు జిల్లాలో పార్టీ క్యాడ‌ర్‌కు, ఎమ్మెల్యేల‌కు అందుబాటులో ఉండాల్సిన బొజ్జ‌ల ఈ విష‌యంలో ఫెయిల్ అవుతున్నారు. అనారోగ్యమే ఇందుకు ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. దీంతో చంద్ర‌బాబు 2019 ఎన్నిక‌ల క్యాబినెట్‌ను రెడీ చేసుకుంటున్న క్ర‌మంలో బొజ్జ‌ల‌ను త‌ప్పించి ప‌ల‌మ‌నేరు ఎమ్మెల్యే అమ‌ర్‌నాథ్‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇచ్చేందుకు డెసిష‌న్ తీసుకున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది.

ఇక అదే జిల్లాకు చెందిన మ‌రో సీనియ‌ర్‌, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు సైతం మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్నా అదే జిల్లా నుంచి లోకేశ్ మంత్రి అవుతుండ‌డంతో పాటు చంద్ర‌బాబు, లోకేశ్‌, గాలి ముగ్గురూ ఒకే సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు కావ‌డంతో గాలికి బెర్త్ క‌ష్ట‌మే.