ఏపీ కేబినెట్లో ఆ సీనియ‌ర్ మంత్రి డ‌మ్మీ అయ్యారా..!

30 ఏళ్ల‌కు పైగా సుదీర్ఘ‌ రాజ‌కీయ అనుభ‌వం.. ఎన్నో కీల‌క‌మైన శాఖ‌ల‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌హించిన సీనియారిటీ.. ఉంటేనేం శాఖ కేటాయింపుల్లో వేటినీ ప‌రిగ‌ణ‌న‌లోని తీసుకోలేదు! కీల‌క‌మైన శాఖ కేటాయించినా.. అందులో స్వ‌తంత్రంగా నిర్ణ‌యాలు తీసుకోలేని ప‌రిస్థితి! ఆశాఖ‌కు సంబంధించి ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం మిన‌హా ఇంక ఏమీ చేయ‌లేని దుస్థితి క‌ళా వెంక‌ట‌రావుకు వ‌చ్చింద‌ని ఆయ‌న వ‌ర్గీయులు ఇప్పుడు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. చంద్ర‌బాబుకు ఏదో అక్క‌సు మ‌న‌సులో పెట్టుకుని త‌మ నాయ‌కుడికి ఇలాంటి అప్రాధాన్య శాఖ కేటాయించార‌ని వాపోతున్నారు.

క్యాబినేట్ విస్త‌రణ త‌ర్వాత‌.. ఇప్పుడు నెమ్మ‌దిగా ఆయా శాఖ‌లు పొందిన మంత్రుల వ‌ర్గీయులు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా క‌ళా వెంక‌ట‌రావు వంటి సీనియ‌ర్ల‌కు అప్రాధాన్య శాఖ కేటాయించ‌డంపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. తనకు హోంశాఖ కానీ, వ్యవసాయశాఖ కానీ కేటాయిస్తారనే నమ్మకం ‘కళా’కు ఉంది. ఆఖరు నిమిషంలో పరిస్థితి తారుమారైంది. తానొక‌టి త‌లిస్తే దైవ‌మొక‌టి త‌ల‌చింద‌న్న చందంగా.. విద్యుత్ శాఖ‌ను కేటాయించారు. విద్యుత్ శాఖలో పని తక్కువగా ఉంటుంది. విధానపర నిర్ణయాలన్నీ సీఎం మాత్రమే తీసుకుంటారు.

ఉత్తర్వులు జారీ చేసేందుకు మాత్ర‌మే ఇంధనశాఖ ఉంటుంది. ఈ శాఖ కింద పనిచేసే సంస్థలన్నింటికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. జెన్‌కో…ట్రాన్స్‌కో ఇతర సంస్థలకు ప్రత్యేక అధికారులు ఉంటారు. వారే ఇంజనీర్లు బదిలీలు, పోస్టింగ్‌ల నిర్ణయాలు తీసుకుంటారు. ఒక్కొక్కసారి బదిలీలను కౌన్సిలింగ్‌ ద్వారా విద్యుత్‌ సంస్థలు నిర్వహిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆ శాఖకు మంత్రి ఉన్నా లేకున్నా పోయేదేమీ ఉండదు. 30 ఏళ్ల‌కు పైగా రాజ‌కీయ అనుభం ఉండి.. హోం, మున్సిప‌ల్ శాఖ‌ల‌కు మంత్రిగా ప‌నిచేసిన ఆయ‌న‌కు ఇలాంటి అప్రాధాన్య శాఖ కేటాయించి క‌ళాను అవ‌మానించార‌ని ఆయ‌న అనుచ‌రులు వాపోతున్నారు. ఏదో కోపంతోనే ఇలా చేశార‌ని అనుమానిస్తున్నారు.

కళాపై చంద్రబాబుకు ఏదో కోపం మనసులో ఉండి ఉంటుందని బ‌ల‌మైన న‌మ్మ‌కంతో ఉన్నారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆపార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి మూడవ స్థానానికే పరిమితమైన ఆయ‌న‌.. మళ్లీ టీడీపీ గూటికి చేరి 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంత‌రం ఏపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమితు లయ్యారు. ఒకప్పుడు హోంశాఖను, కమర్షియల్‌ట్యాక్స్‌, మున్సిపల్‌శాఖలను నిర్వహించిన కళాకు 34సంవత్సరాల రాజకీయ, అధికార అనుభవం తరువాత పనిలేని ఇంధనశాఖకు మంత్రిగా కేటాయించ‌డం ఆయన అదృష్టమని అంతా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఏదేమైనా క‌ళా అప్పుడే డ‌మ్మీ మంత్రి అయ్యార‌న్న గుస‌గుస‌లు జోరుగా విన‌వ‌స్తున్నాయి.