ఆ జిల్లాలో మంత్రుల మ‌ధ్య ఆధిపత్య‌పోరు

వర్గపోరుకీ, రాజకీయ యుద్ధాలకీ పెట్టింది పేరైన నెల్లూరులో ఇద్దరు మంత్రుల మ‌ధ్య పొర‌ప‌చ్చాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ మంత్రి నారాయ‌ణ ఆడింది ఆట పాడింది పాట‌గా ఉన్న ఈ జిల్లాలో.. ఆయ‌న‌కు పోటీగా సోమిరెడ్డి వ‌చ్చారు. క్యాబినెట్ లో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మంత్రి పదవి ద‌క్క‌డంతో ఒక్కసారిగా నెల్లూరు జిల్లాలో పాలిటిక్స్ హీటెక్కాయి. దీంతో క్యాడ‌ర్‌లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక‌పక్క సోమిరెడ్డి దూసుకుపోతుం డ‌టంతో.. నారాయ‌ణ కూడా ఆయ‌న్ను అందుకునేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌.

మంత్రివర్గ విస్తరణకి ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు నారాయణకి అగ్నిపరీక్షగా మారాయి. నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, మిగిలిన నేతలు ఆచితూచి అడుగులు వేస్తూ, ప్రత్యర్థి పార్టీ ఎత్తులు చిత్తుచేశారు. కానీ… పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలకి సంబంధించి ఆయ‌న‌ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం కనిపించిందని పరిశీలకులు అంటున్నారు. మంత్రి నారాయణపై కాన్ఫిడెన్స్ సన్నగిల్లడం వల్లనే సోమిరెడ్డికి మంత్రి పదవి దక్కిందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇక రాజధాని భూముల సేకరణలోనూ సఫలీకృతుడైనా జిల్లాలో మంత్రిగా సరైన పాత్ర పోషించలేకపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆ తర్వాత కూడా జిల్లాలో రాజకీయంగా సరైన అడుగులు వేయలేకపోయారని పరిశీలకులు అంటున్నారు. ఇక సోమిరెడ్డి మంత్రి అవుతున్నారని తెలియగానే అధికారవర్గాల్లో గుబులు మొదలయ్యింది. సోమిరెడ్డి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు తన పవర్ ఏమిటో చూపించారు. అదేస్థాయిలో మళ్లీ ఆయన హవా కొనసాగితే బాగుంటుందని కొందరు ఆశిస్తున్నారు. సోమిరెడ్డి మంత్రి పదవి చేపట్టి జిల్లాకి రాగానే పార్టీ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కానీ… ఆ పార్టీకి చెందిన ఆనం సోదరులు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి తదితరులు సైలెంట్ అయిపోయారు. అయితే సోమిరెడ్డి ఎక్కడా డాంబికాన్ని ప్రదర్శించలేదు. స్వయంగా నేతలందరి ఇళ్లకి వెళ్లి మరీ కలిశారు.

ఒక పక్క సోమిరెడ్డి తన పలుకుబడి పెంచుకుంటుంటే నారాయణ ఊరుకోలేరు కదా. ఆయనా తన శైలిని మార్చుకున్నారట. అధికారులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో సమీక్షా సమావేశం నిర్వ‌హించి ఎన్నడూలేని విధంగా అందరినీ పేరుపేరునా పలుకరించారట. నెల్లూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హవా ఎక్కువ. అయితే వైసీపీ నేతల మధ్య సమన్వయం లేదు. ఇవి టీడీపీకి కలిసొచ్చే అంశాలు. మ‌రి వీరిద్ద‌రూ ఆధిప‌త్య పోరుకి చెక్ చెప్పి.. స‌మ‌న్వ‌యంతో ముందుకెళ‌తారేమో వేచిచూద్దాం!