అద్వానీని రాష్ట్ర‌ప‌తి రేసు నుంచి త‌ప్పించారా..! అస‌లు క‌థ ఇదే..!

భార‌త రాష్ట్ర‌ప‌తి రేసులో బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీ ఉన్నార‌ని గ‌త కొద్ది రోజులుగా మీడియాలో ర‌క‌ర‌కాలుగా వార్తలు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. పార్టీలో మోస్ట్‌ సీనియర్‌ నేత అయిన అద్వానీకి గురుదక్షిణగా రాష్ట్రపతి పదవి ఇస్తామని సోమనాథ్‌ జ్యోతిర్లింగం సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చార‌ని నిన్న‌టి వ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగింది.

కొద్ది రోజులుగా ఈ ప‌ద‌వికి అద్వానీ పేరుతో పాటు బీజేపీ సీనియర్‌ నేత మురళీమనోహర్‌ జోషి, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌, బీజేపీ అనుబంధ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భాగవత్‌ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఈ వార్త‌ల‌పై మోహ‌న్ భ‌గ‌వ‌త్ గ‌తంలోనే క్లారిటీ ఇచ్చేశారు. తాను రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి రేసులో లేన‌ని ఆయ‌న తేల్చిచెప్పారు.

ఇక ఇప్పుడు అద్వానీ వంతు వ‌చ్చింది. శుక్ర‌వారం పార్ల‌మెంటు సాక్షిగా తాను కూడా రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి రేసులో లేన‌ని స్ప‌ష్ట‌త ఇచ్చారు. పార్ల‌మెంటు వెలుప‌ల అద్వానీ మీడియాతో మాట్లాడుతూ తాను రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి పోటీలో లేన‌ని చెప్పేశారు. ఇక ప్ర‌స్తుత రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప‌ద‌వీకాలం జూలై 24తో ముగుస్తుంది.

దీంతో మ‌రి కొత్త రాష్ట్ర‌ప‌తి రేసులో ఎవ‌రెవ‌రు ఉంటార‌న్న‌ది పెద్ద స‌స్పెన్స్‌గానే మారింది. వాస్త‌వానికి అద్వానీ 1999లోనే ప్ర‌ధాన‌మంత్రి అవ్వాల్సి ఉన్నా ఎన్డీయేలోని మిత్ర‌ప‌క్షాల సూచ‌న మేర‌కు వాజ్‌పేయ్ ప్ర‌ధాన‌మంత్రి అయ్యారు. ఉప ప్ర‌ధానిగా అద్వానీ బాగానే చ‌క్రం తిప్పారు. అయితే ఆయ‌న బీజేపీలో అద్వానీ మాట చెల్లే ప‌రిస్థితి లేదు. ఆయ‌న మాట‌ను ప‌ట్టించుకునే స్థితిలో కూడా బీజేపీ అధిష్టానం లేదు.

ఆర్ఎస్ఎస్ త‌న‌కు త‌ల్లిలాంటిద‌ని ఇటీవ‌ల అద్వానీ చెప్పినా సంఘ్‌ప‌రివార్ మాత్రం అద్వానీని రాష్ట్ర‌ప‌తి చేసే విష‌యంలో అంత సుముఖంగా లేన‌ట్టు తెలుస్తోంది. సంఘ్‌ప‌రివార్ మాత్రం గ‌తంలో మాన‌వ‌వ‌న‌రుల శాఖా మంత్రిగా ప‌నిచేసిన ముర‌ళీమ‌నోహ‌ర్ జోషీనే రాష్ట్ర‌ప‌తిని చేయాల‌ని ప‌ట్టుబ‌డుతోంద‌ట‌. మ‌రో వైపు బాబ్రీ మ‌సీదు కేసులో అద్వానీపై అభియోగాలు ఉన్నాయి. ఈ విష‌యంలో జోషీపై కూడా అభియోగాలు ఉన్నా అద్వానీపైనే ఎక్కువుగా అభియొగాలు ఉన్నాయి. మ‌రో వైపు అద్వానీ రాష్ట్ర‌ప‌తి ఆశ‌ల‌కు కావాల‌నే మోడీ అండ్ కో బ్రేకులు వేయిస్తోందా అన్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.