దుకాణం బంద్ చేసిన ఎంపీ కేశినేని

ఏపీ, తెలంగాణ‌లో కేశినేని ట్రావెల్స్ అంటే బ‌స్సు స‌ర్వీసుల్లో నెంబ‌ర్ వ‌న్ సంస్థ‌గా పేరుంది. స్వాతంత్య్రానికి పూర్వం నుంచే కేశినేని ఫ్యామిలీ ట్రావెలింగ్ రంగంలో ఉంది. అప్ప‌ట్లోనే వాళ్లు విజ‌య‌వాడ నుంచి మ‌చిలీప‌ట్నానికి బ‌స్సులు న‌డిపేవార‌ట‌. ట్రావెలింగ్ రంగంలో అంత సుదీర్ఘ‌మైన చ‌రిత్ర ఉన్న కేశినేని ట్రావెల్స్‌ను ఈ రోజు శాశ్వ‌తంగా మూసేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఈ ట్రావెల్స్ అధినేత కేశినేని నాని ప్ర‌స్తుతం విజ‌య‌వాడ టీడీపీ ఎంపీగా ఉన్నారు. ఇటీవ‌ల బాగా న‌ష్టాలు వ‌స్తుండ‌డంతో త‌న ట్రావెల్స్‌ను మూసేస్తామ‌ని నాని చెపుతూ వ‌స్తున్నారు. ఇక ఈ రోజు తాజాగా కేశినేని ట్రావెల్స్ సంస్థను మూసివేశారు. బెజవాడలోని ఆ సంస్థ కార్యాలయం వద్ద బోర్డు కూడా తొలగించారు.

450 బ‌స్సుల వ‌ర‌కు ఉండే కేశినేని ట్రావెల్స్‌కు ఇటీవ‌ల పోటీగా ప‌లు ట్రావెల్స్ సంస్థ‌లు రావ‌డంతో భారీ న‌ష్టాలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ఇటీవ‌ల 170 బ‌స్సుల వ‌ర‌కు అమ్మేశారు. ఇక వారం రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్‌లు క్లోజ్ చేయ‌గా, గ‌త అర్ద‌రాత్రి నుంచే ట్రావెల్స్ ఆపేశారు. హైద‌రాబాద్‌తో పాటు విజ‌య‌వాడ లాంటి ప‌ట్ట‌ణాల్లో కేశినేని ట్రావెల్స్ కార్యాలయాలను మూసివేశారు.

ఇటీవ‌ల కేశినేని ట్రావెల్స్ రేటింగ్‌లో బాగా వెన‌క‌ప‌డిన‌ట్టు టాక్‌. ఆరెంజ్ ట్రావెల్స్‌తో ఉన్న పోటీని కేశినేని ట్రావెల్స్ త‌ట్టుకోలేక‌పోయిన‌ట్టు స‌మాచారం. ఆరెంజ్ ట్రావెల్స్‌కు వ్య‌తిరేకంగా రిపోర్టు ఇవ్వాలంటూ నాని సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమాతో క‌లిసి వెళ్లి విజ‌య‌వాడ ఆర్టీవో క‌మిష‌న‌ర్ బాల సుబ్ర‌హ్మ‌ణ్యంతో వాద‌న‌కు దిగార‌న్న వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఈ వివాదం పెద్ద‌ది కావ‌డంతో చివ‌ర‌కు చంద్ర‌బాబు వ‌ద్ద‌కు వెళ్లి ఆయ‌న నానితో పాటు ఉమాకు వార్నింగ్ ఇచ్చే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది.

అప్పుడే నాని కేశినేని ట్రావెల్స్‌ను మూసేందుకు డిసైడ్ అయ్యి ప్రెస్‌మీట్ పెట్టేందుకు కూడా రెడీ అయ్యారు. అయితే చంద్ర‌బాబు వ‌ద్ద‌ని వారించ‌డంతో వారం రోజుల పాటు ఆగిన నాని చివ‌ర‌కు ట్రావెల్స్ మూసివేశారు.