సుజ‌నా వ్యూహంతో కంభంపాటికి చిక్కులు

వ్యాపార‌వేత్తగానే కాదు.. రాజ‌కీయ నాయ‌కుడిగానూ తానేంటో నిరూపించారు సుజ‌నా చౌద‌రి! సీఎం చంద్రబాబు ఆర్థికంగా అండ‌దండ‌లందించి.. ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితుడిగా మారిపోయారు. ఎన్నిక‌ల్లో ఏపీలో, ఎన్నిక‌ల త‌ర్వాత ఢిల్లీలో చ‌క్రం తిప్పుతూ త‌న వ్యూహాల‌ను అమ‌లుచేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక ప‌వ‌ర్ హౌస్‌గా మారిపోయారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్‌లో అధికార ప్ర‌తినిధి కంభంపాటి రామ్మోహ‌న‌రావు ప్రాధాన్యం ఎక్కువ‌గా ఉండేది. కానీ సుజ‌నా త‌న చ‌తుర‌త‌తో ఆయ‌న్ను లైమ్ లైట్ నుంచి త‌ప్పించి.. ఇక ఢిల్లీలో ఏ ప‌నయినా త‌న క‌నుస‌న్న‌ల్లో జ‌రిగేలా వ్యూహాలు ర‌చించారు.

కంభ‌పాటి రామ్మోహ‌న‌రావు, చంద్ర‌బాబు స‌న్నిహితంగా మెలిగేవారు. ముఖ్యంగా 1990 ద‌శాబ్దంలో చంద్ర‌బాబు.. ఢిల్లీలో చ‌క్రం తిప్ప‌డంలో కంభంపాటి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ప‌లువురు ఢిల్లీ నాయ‌కుల‌తో ఆయ‌నకు స‌త్సంబంధాలు ఉండేవి. అందుకు చంద్ర‌బాబు.. ఢిల్లీలో ఏపీ ప్ర‌తినిధిగా నియ‌మించారు. ఎవ‌రితో మాట్లాడాల‌న్నా ఆయ‌న్ను క‌న్స‌ల్ట్ చేస్తే స‌రిపోయేది. దీంతో ఆయ‌న ప‌వ‌ర్ హౌస్‌గా మారిపోయారు. అయితే ప్రస్తుతం బ‌ళ్లు ఓడ‌లు.. ఓడ‌లు బ‌ళ్లు అవ‌డానికి ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌లేదు. కంభంపాటి ప్రాధాన్యం క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతోంది.

ఇదేస‌మ‌యంలో కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రికి అత్యంత ప్రాధాన్యం పెరుగుతోంది. చంద్ర‌బాబు మ‌ద్ద‌తు పుష్క‌లంగా ఉండ‌టంతో.. ఢిల్లీలో తానో ప‌వ‌ర్ హౌస్‌గా మారాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట సుజ‌నా! దీంతో పాటు ఇత‌ర ఎంపీలు.. కంభంపాటి వ‌ద్ద‌కు వెళ్ల‌డం కూడా ఆయ‌న‌కు న‌చ్చ‌లేద‌ట‌. దీంతో వెంట‌నే చంద్ర‌బాబు వ‌ద్ద త‌న వ్యూహాన్ని అమ‌లుచేశారు. ఈ వ్య‌వ‌హారంతో ఒక్కసారిగా చంద్ర‌బాబు-కంభంపాటి మ‌ధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింద‌ట‌. కంభంపాటికి అస‌లు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేద‌ట‌.

కంభంపాటి ప‌ద‌వీ కాలం పూర్త‌యిపోయినా చంద్ర‌బాబు ప‌ట్టించుకోలేదంటే వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ ఎంత‌లా పెరిగిందో అర్థం చేసుకోవ‌చ్చు! ఆయ‌న ప‌ద‌వి రెన్యూవ‌ల్ కాక‌పోవ‌డంతో ఇక సుజ‌నాదే అధికారంలా మారిపోయింది. మొత్తానికి కంభంపాటికి సుజ‌నా చౌద‌రి బాగానే ఎర్త్ పెట్టాడ‌నే గుస‌గుస‌లు పార్టీలో వినిపిస్తున్నాయి. చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితంగా ఉన్న నాయ‌కుడిని ప‌క్కకు త‌ప్పించ‌డంలో సుజ‌నా తెలివితేట‌లు విని అంతా అవాక్క‌వుతున్నారు!!