బీజేపీ బాహుబ‌లి అత‌డా? ఆమెనా?

ఏపీలో సొంతంగా బ‌ల‌ప‌డాల‌ని బీజేపీ సిద్ధ‌మైంది. పార్టీ కొన్ని చోట్ల బ‌లంగా ఉన్నా.. శ్రేణుల‌న్నింటినీ ఏకం చేసి ఎవ‌రు న‌డిపిస్తార‌నే విష‌యంపై ఇంకా క్లారిటీ రాలేదు. రాష్ట్రానికి సంబంధించి అప్పుడప్పుడూ కొంత మంది పేర్లు వినిపిస్తున్నా.. వీరెవ‌రూ కాద‌ని ఒక ఫేమ‌స్ ఫేస్ కోసం ఇప్పుడు ప్ర‌య‌త్నిస్తోంది. ముఖ్యంగా ఇద్ద‌రి పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవ‌రిని ప్ర‌ధాని మోదీ, అధ్య‌క్షుడు అమిత్ షా ఎంపిక చేస్తార‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

2019 ఎన్నిక‌ల నాటికి ఏపీలో బీజేపీకి ఒక నాయ‌కుడు కావాలి. కంభంపాటి హ‌రిబాబు, పురంధేశ్వ‌రి, క‌న్నా లక్ష్మీనారాయ‌ణ‌.. సీనియ‌ర్ నేత‌లు ఉన్నా ఇప్పుడు కొత్త నాయ‌కుడి కోసం బీజేపీ వెదుకుతోంది. ముఖ్యంగా ఏపీకి సాయం చేస్తున్నా అదంతా టీడీపీ క్రెడిట్‌లోకి వెళిపోతుండ‌టంతో ఇప్పుడు త‌మ విజ‌యాల‌ను చెప్పే నాయ‌కుడి కోసం బీజేపీ పెద్ద‌లు వెదుతుకుతున్నారు. ఇందులో ప్ర‌ధానంగా రాధా మాధ‌వ్‌, కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒక‌రు ఏపీలో బీజేపీ ప‌గ్గాలు అందుకునే అవ‌కాశ‌ముంద‌నే ప్ర‌చారం జోరందుకుంది.

ప్ర‌ధానంగా కేంద్ర‌మంత్రి వెంక‌య్య పేరు వినిపించినా.. ప్ర‌ధాని మోదీ ఇందుకు సుముఖంగా లేర‌ని తెలుస్తోంది. ఇక ఏపీకి చెందిన రాధామాధ‌వ్‌కు ఆర్ఎస్ఎస్ గ‌ట్టి మ‌ద్ద‌తు ఉంది. మంచి వాయిస్ ఉన్న నేత‌గా, బీజేపీ యంగ్ బ్రిగేడ్ లిస్ట్లో ఉన్నారు. కాబ‌ట్టి ఆయ‌న్ను ఏపీకి పంపితే ఎలా ఉంటుంద‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నార‌ట‌. ఈ మేర‌కు వెంక‌య్య‌తోనూ చ‌ర్చించ‌గా.. రామ్ మాధ‌వ్ అయితే ఏపీ బాహుబ‌లి అవుతాడ‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశార‌ట‌. మ‌రో వైపు ఈ రేసులో నిర్మ‌లా సీతారామ‌న్ పేరు వినిపిస్తోంది. ఆమెపై మోదీకి మంచి అభిప్రాయం ఉంది. ఆమె ప్ర‌తిభ‌పై కూడా న‌మ్మ‌కంతో ఉన్నార‌ట‌. ఈ స‌మ‌యంలో ఆమెను ఏపీకి పంపితే బాగుంటుంద‌ని పెద్ద‌లు భావిస్తున్నార‌ట‌.

అటు రామ్ మాధ‌వ్‌, ఇటు నిర్మలా సీతారామ‌న్‌లో ఎవ‌రు ఏపీ బాహుబ‌లి అవుతారోననే చ‌ర్చ ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో జోరందుకుంది. మోదీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌రి ఇదే స‌మ‌యంలో మిత్ర ప‌క్ష‌మైన టీడీపీ ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే!!