మరో వ్యూహంతో టీఆర్ఎస్ బలాన్ని నిరూపించేందుకు సిద్ధమవుతున్న కెసిఆర్

కొడితే ఏనుగు కుంభ‌స్థ‌లాన్ని కొట్టాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్షం బ‌లంగా ఉన్న న‌ల్గొండ‌ను టార్గెట్ చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ అధిష్టాన పెద్ద‌లంద‌రికీ ఒకేసారి స‌మాధానం చెప్పాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. అంతేగాక టీఆర్ఎస్ బ‌లాన్ని నిరూపించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన.. ఎంపీ గుత్తాసుఖేంద‌ర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాల‌ని భావిస్తున్న త‌రుణంలో.. నల్లగొండ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వ‌హించి, ప్ర‌జల్లో టీఆర్ఎస్‌కు ప్ర‌జాద‌ర‌ణ ఉంద‌ని కాంగ్రెస్‌కు తెలిసొచ్చేలా చేసేందుకు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు.

త‌న వ్యూహాల‌తో ఇప్ప‌టికే టీడీపీని నిర్వీర్యం చేసిన కేసీఆర్‌.. మ‌రో వ్యూహంతో కాంగ్రెస్‌ను చిత్తుచేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్‌లో కొన్ని పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఎలాగైనా పార్టీకి జ‌వ‌స‌త్వాలు నింపాల‌ని కాంగ్రెస్ పెద్ద‌లు కంకణం క‌ట్టుకున్నారు. అయితే ఇప్పుడు వారి వ్యూహాన్ని చిత్తు చేసే వ్యూహంతో కేసీఆర్ బ‌రిలోకి దిగ‌బోతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని శాసనమండలికి పంపించాలని టీఆర్ఎస్‌ యోచిస్తోంది. అనంత‌రం ఆ లోక్ సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో ఘ‌నంగా విజ‌యం సాధించి.. ఒకేసారి కాంగ్రెస్‌కు ప్ర‌జాద‌ర‌ణ లేద‌ని.. ప్ర‌చారం చేసేందుకు అవ‌కాశ‌ముంది. తద్వారా కాంగ్రెస్ కేడ‌ర్‌ను దెబ్బ‌తీయ‌చ్చ‌నేది వ్యూహం!!

దీని వెనుక పెద్ద వ్యూహ‌మే ఉన్న‌ట్లు తెలుస్తోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ పార్లమెంటు స్థానం పరిధిలోనే పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి – ఆయన సతీమణి పద్మావతి – ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి – కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ లు ఉన్నాయి. దీంతో అక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తే కాంగ్రెస్ – టీఆర్ ఎస్ బలాబలాలు ఎంతో తేలుతుందని గులాబీ దళపతి కేసీఆర్ భావిస్తున్నార‌ట‌. బడ్జెట్ సమావేశాల తర్వాత గుత్తాతో రాజీనామా చేయించనున్నట్లు సమాచారం.

తెలంగాణ శాసనమండలిలోని ఎమ్మెల్యే కోటాలో ఖాళీకానున్న మూడు  ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. అందులో ప్రస్తుతం టీఆర్ ఎస్ – ఎంఐఎం – కాంగ్రెస్ పార్టీలు ఒక్కో స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఎంఐఎంకు ఇప్పటికే హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా కింద ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయించి నందున ఎమ్మెల్సీ కోటా కింద‌ ఖాళీ అవుతున్న ఎంఐఎం స్థానాన్ని ఆ పార్టీకి కేటాయించే అవకాశం లేనట్లు తెలిసింది. అదే సమయంలో మూడు స్థానాలను గెలుచుకునేందుకు అవసరమైన సంఖ్యా బలం టీఆర్ ఎస్ కు ఉంది.