భూమా మృతితో మార‌నున్న క‌ర్నూలు పాలిటిక్స్‌

టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌, క‌ర్నూలు జిల్ల నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మృతితో క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. వాస్త‌వానికి త్వ‌ర‌లో జ‌రిగే ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో భూమాకు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. భూమా మంత్రి ప‌ద‌వి హామీతోనే వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన సంగ‌తి తెలిసిందే.

గ‌తంలో టీడీపీలో ప‌నిచేసిన భూమా ఆ త‌ర్వాత ప్ర‌జారాజ్యం పార్టీలోకి వెళ్లారు. ఆ త‌ర్వాత ప్ర‌జారాజ్యం నుంచి భూమా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. భూమా భార్య శోభా నాగిరెడ్డి మాత్రం ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్య‌గా విజ‌యం సాధించారు. అనంత‌రం వైసీపీలోకి జంప్ చేసిన భూమా దంప‌తులు అక్క‌డ విజ‌యం సాధించారు.

శోభా 2012 ఉప ఎన్నిక‌ల్లోనే వైసీపీ నుంచి విజ‌యం సాధించారు. 2014లో భూమా నంద్యాల నుంచి, శోభ ఆళ్ల‌గ‌డ్డ నుంచి విజ‌యం సాధించారు. త‌ర్వాత రోడ్డు ప్ర‌మాదంలో భార్య శోభ మృతిచెంద‌డంతో అక్క‌డ ఉప ఎన్నిక‌ల్లో త‌న పెద్ద కుమార్తె శోభ‌ను నిల‌బెట్టి ఏక‌గ్రీవంగా గెలిపించుకున్నారు. ఇక త‌న జీవితంలో చిర‌కాల కోరిక‌గా ఉన్న మంత్రి ప‌ద‌వి వ‌స్తే క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో ఓ రేంజ్‌లో చ‌క్రం తిప్పాల‌ని భూమా భావించారు.

కేబినెట్‌లోకి ఎంట్రీ ఇవ్వాల‌న్న త‌న చిర‌కాల కోరిక నెర‌వేర‌కుండానే ఆయ‌న మృతిచెందారు. ఇక నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో సైతం ఎవ‌రిని నిల‌బెట్టాలో చంద్ర‌బాబుకు క‌త్తిమీద సాముగానే ఉంటుంది. అక్క‌డ భూమాకు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా ఉంటోన్న శిల్ప సోద‌రుల‌కే నంద్యాల టిక్కెట్టు ఇస్తారా ? లేదా భూమా కుమారుడు అక్క‌డ బ‌రిలో ఉంటారా ? అన్న‌ది చూడాలి.

ఇక భూమా మృతి చెందిన ఆయ‌న‌కు హామీ ఇచ్చిన‌ట్టుగానే ఆయ‌న కుమార్తె, ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే అఖిల‌ప్రియ‌కు బాబు ఉగాదికి జ‌రిగే కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌వ‌చ్చని ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. ఏదేమైనా భూమా మృతితో క‌ర్నూలు రాజ‌కీయాలు కాస్త కంగాళీగా మారాయి.