టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు `మార్కుల` టెన్ష‌న్‌

ఎమ్మెల్యేల ప‌నితీరు ఆధారంగా వారికి ర్యాంకులు ప్ర‌క‌టిస్తూ ఉంటారు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు! ఇప్పుడు ఇలాంటి స‌ర్వేనే తెలంగాణ‌లోనూ నిర్వ‌హించారు సీఎం కేసీఆర్‌! ఇప్పుడు ఈ స‌ర్వే, ర్యాంకులే హాట్ టాపిక్‌గా మారాయి! కేవ‌లం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనే కాకుండా.. ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఈ స‌ర్వే జ‌ర‌గ‌డంతో అంతా దీని గురించే చ‌ర్చించుకుంటున్నారు. అంతేగాక త‌మ‌కు ఎన్ని `మార్కులు` వ‌చ్చాయో తెలియ‌క‌.. ఎమ్మెల్యేలు తెగ టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఎక్కువ వ‌చ్చిన వారికి మాత్రం కేసీఆర్‌.. బంప‌ర్ ఆఫ‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు మాత్రం తెలుస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలంద‌ర‌కూ చ‌ర్చించుకుంటున్న ఒకే ఒక్క అంశం.. శాసనసభ్యుల పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన స‌ర్వే!! ఇందులో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా మార్కులు కేటాయించారు. అసెంబ్లీలో పార్టీలకతీంగా ఎమ్మెల్యేలంద‌రూ.. తమకు వచ్చిన మార్కులపై చర్చించుకుంటున్నారట. మార్కులు ఎక్కువొచ్చిన వారు.. తమ పనితీరుకు ఇదే నిదర్శనమని చెప్పుకుంటున్నారు. అయితే తక్కువ మార్కులొచ్చిన ఎమ్మెల్యేలు మాత్రం.. దీనిని లైట్ తీసుకుంటున్నారు.

ఈ ఫలితాల ఆధారంగానే సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై అంచనాకు వచ్చారట. వీటి ఆధారంగానే ఎమ్మెల్యేలకు ఏ రేంజ్ లో గౌరవం ఇవ్వాలో ఆలోచిస్తున్నారట. ఎక్కువ మార్కులు వచ్చిన ఎమ్మెల్యేలకు పార్టీ లేదా ప్రభుత్వంలో సముచిత గౌరవం ఇచ్చే యోచనలో ఉన్నారని టాక్. ఇక తక్కువ మార్కులు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలకు … సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా పనితీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వడం కూడా కష్టమేనని గట్టిగానే హెచ్చరించారట.

అయితే సర్వేలో తెలంగాణలో అన్ని అసెంబ్లీ స్థానాలు కవర్ కావడంతో విపక్ష సభ్యులు కూడా దీనిపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఆశ్చర్యకరంగా కొంతమంది విపక్ష సభ్యులకు ఈ సర్వేలో మంచి మార్కులు వచ్చాయ‌ట‌. అవి నిజంగానే వచ్చాయా..? లేకపోతే విపక్ష నేతలను బుట్టలో వేసుకునేందుకు ఎక్కువ మార్కులేశారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి కేసీఆర్ ఏం చేసినా.. దాని వెనుక గ‌ల ర‌హ‌స్యాలు అప్పుడే బ‌య‌ట‌ప‌డ‌వు క‌దా!! మ‌రి ఇప్పుడు స‌డ‌న్‌గా కేసీఆర్ ఈ స‌ర్వే ఎందుకు చేయించారో ఏమోగాని.. ఎమ్మెల్యేలకు మాత్రం టెన్ష‌న్ త‌ప్ప‌డంలేదు!