అమెరికా ఉద్యోగుల ‘ఔట్‌ సోర్సింగ్‌’ బిల్లు ప్రకంపనలు

అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత నుంచి త‌న వివాదాస్ప‌ద‌ నిర్ణ‌యాల‌తో అటు అమెరికానే గాక ఇటు ప్ర‌పంచ దేశాల‌ను కూడా వ‌ణికిస్తున్నారు ట్రంప్‌!! ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటాడో తెలియ‌క ప్ర‌పంచ దేశాలు టెన్ష‌న్ ప‌డుతున్నాయి! ముఖ్యంగా ట్రంప్ `ఔట్ సోర్సింగ్` దెబ్బ‌.. ఇప్పుడు హైటెక్ సిటీని తాక‌బోతోంది. ఇప్ప‌టికే అక్ర‌మ వ‌ల‌స‌లు నివార‌ణకు ప్ర‌వేశ‌పెట్టిన బిల్లుతోనే అమెరికాలోని తెలుగు ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే.. ఇప్పుడు కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన `ఔట్ సోర్సింగ్‌` బిల్లు హైద‌రాబాద్‌లోని ఐటీ ఉద్యోగుల‌కు శ‌రాఘాతంటా మార‌నుంది. ఈ బిల్లుతో ఇక సైబ‌ర్ సిటీగా పేరొందిన హైద‌రాబాద్‌.. పూర్వ వైభ‌వాన్ని కోల్ప‌తుంద‌ని విశ్లేష‌కుల అంచ‌నా!!

అమెరికా ఉద్యోగాల ‘ఔట్‌ సోర్సింగ్‌’కు అడ్డుకట్ట వేసేందుకు ఇటీవల ప్రవేశపెట్టిన బిల్లు మన హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత ఐటీ ఎగుమతులు అమెరికా మీదనే ఎక్కువగా ఆధారపడి జరుగుతున్నాయి. మన ఎగుమతుల్లో దాదాపు 60 శాతం అక్కడికే. ఇక, ఔట్‌సోర్సింగ్‌ పరంగా అంతర్జాతీయంగా 55 శాతం వాటా మనదే అని నాస్కామ్‌ లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆ బిల్లు పాసైతే హైదరాబాద్‌కు ఆర్థిక నష్టం మాత్రమే కాదని.. దానివల్ల కోల్పోయే ఉద్యోగాలను పరిగణలోకి తీసుకుంటే 20 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లేనని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

ట్రంప్‌ చెప్పినట్లుగా హెచ్‌1బీ వీసాలను ఆపేయడం, ఔట్‌సోర్సింగ్‌పై కొరడా ఝుళిపించడం, అమెరికన్లకే తొలి ప్రాధాన్యం వంటివాటిని అమలు చేస్తే ఇండియాలో 25 లక్షల మంది ఉద్యోగులపై ప్రత్యక్షంగా.. 2 కోట్ల మందిపై పరోక్షంగా ప్రభావం పడుతుందని హైదరాబాద్‌ ఐటీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో దాదాపు 5 వేలకు పైగా ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు ఉన్నాయని అంచనా. భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు 110 బిలియన్‌ డాలర్లుగా ఉంటే ఒక్క హైదరాబాద్‌ నుంచి 87 వేల కోట్ల రూపాయల ఎగుమతులు ఐటీ, ఐటీఈఎస్‌ పరంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ అంచనాలన్నీ తలకిందులయ్యే ప్రమాదం అధికంగా ఉందన్నది ఐటీ నిపుణుల మాట.

తాజా పరిణామాల నేపథ్యంలో.. అమెరికాలో అమల్లోకి రానున్న కఠిన నిబంధనలు, ఫీజుల పెంపు వంటివి కంపెనీలకు తలకు మించిన భారం కాబోతున్నాయి. ఇన్ఫోసి్‌సలాంటి కంపెనీలు.. ఈ నిబంధనలు తమ మార్జిన్స్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని ఇప్పటికే చెబుతున్నాయి. దీనివల్ల కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకోక తప్పని పరిస్థితి. మన ఔట్‌సోర్సింగ్‌ పరిశ్రమకు స్వల్పకాలంలో నష్టం కలిగించినా తమను తాము పునర్విచించకోవడానికి లభించిన అవకాశంగానే పేర్కొనాలంటున్నారు సాఫ్ట్‌వేర్‌ రంగ నిపుణులు.