నారాయ‌ణ‌.. ఆనంపై ఈ చిన్న చూపేలా!!

పూల‌మ్మిన చోటే.. క‌ట్టెల‌మ్మ‌డం ఈ మాట రాజ‌కీయాల్లో త‌ర‌చూ వినిపిస్తుంది. పార్టీ అధికారంలో ఒక వెలుగు వెలిగి.. త‌మ మాటే శాస‌నంగా ఉన్న నాయ‌కులు.. ప‌వ‌ర్ పోగానే ఒక్క‌సారిగా చీక‌ట్లోకి వెళిపోతారు! త‌మకు కావాల్సిన ప‌నుల‌ను చిటికెలో చేయించుక‌న్న చోటే.. త‌మ ప‌ని అవ్వ‌డానికి ఎంతో కాలం వేచిచూడాల్సిన ప‌రిస్థితి! ప్ర‌స్తుతం నెల్లూరు జిల్లాలోనూ ఇలాంటి సంఘ‌ట‌నలే జ‌రుగుతున్నాయి. ఆనం వివేకానంద‌రెడ్డికి, మంత్రి నారాయ‌ణ‌కు మ‌ధ్య ఇటీవ‌ల జ‌రిగిన ఒక సంఘ‌ట‌న‌.. అచ్చు సినిమాలోని సన్నివేశాన్ని త‌ల‌పించేలా ఉంద‌ని టీడీపీ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి!!

నెల్లూరు జిల్లా అన‌గానే వెంట‌నే ఆనం సోద‌రుల పేరు తొలుత వినిపిస్తుంది. కాంగ్రెస్ హ‌యాంలో జిల్లాను త‌మ చెప్పు చేతల్లో పెట్టుకుని ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా ఏలారు. అప్పుడు వారెంత చెబితే అంత‌! అదే స‌మ‌యంలో ఇప్ప‌టి మంత్రి నారాయ‌ణ‌.. కేవ‌లం ఒక రెసిడెన్షియ‌ల్ కాలేజీకి అధిప‌తి మాత్ర‌మే! అప్పట్లో ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వ శాఖల నుంచి త‌న‌ కాలేజీ కి ఇబ్బందులు వచ్చినప్పుడు నారాయణ.. ఆనం బ్రదర్స్ దగ్గరికి వెళ్లేవాళ్ళు. ఒక్కోసారి పనయ్యేది. ఒక్కోసారి పని జరిగేదికాదు. మ‌రోసారి అవమానాలు కూడా జరిగేవి. ఈ తరహా ఘటనలు వివేకా,నారాయణ మ‌ధ్య ఎక్కువ‌గా జ‌రిగేవి.

మ‌రి ఇప్పుడు కాలం మారింది. ఒకప్పుడు కేవలం ఓ విద్యాసంస్థ అధిపతి నారాయణ.. రాష్ట్ర మంత్రి.సీఎం చంద్రబాబు అంతరంగికుల్లో ఒకరిగా మారిపోయారు. ఇప్పుడు వివేకా సాధార‌ణ పార్టీ కార్య‌క‌ర్త మాత్ర‌మే! నెల్లూరు లో బాగా పేరున్న వీఆర్ కాలేజీ కి వివేకా కరెస్పాండెంట్‌గా ఉన్నారు. అయితే కాలేజీ క‌మిటీ ఎన్నిక చెల్ల‌ద‌ని హైకోర్టు ఇటీవ‌ల షాకింగ్ తీర్పు ఇచ్చింది. ఆ కాలేజ్ మీద 20 ఏళ్లుగా పట్టు సాగిస్తున్న వివేకా కి ఇది ఊహించని షాక్. అయితే ఈ కాలేజ్ విషయంలో ఒకప్పుడు వివేకాకు వ్యతిరేకంగా టీడీపీ నేతలే పోరాటం చేశారు. కాలేజ్ మీద పట్టు కోల్పోడాన్ని తట్టుకోలేక వివేకా అదే విషయంలో నారాయణ ఇంటికెళ్లారు. త‌న‌కు సాయం చేయాల‌ని నారాయణని వేడుకున్నార‌ట‌. టీడీపీ శ్రేణులు వద్దన్నా స‌రే.. సాయం చేద్దామని నారాయణ మాటిచ్చేదాకా వివేకా అక్కడనుంచి కదల్లేదట.

వివేకా అక్క‌డి నుంచి వెళ్ళాక ఒకప్పుడు కాలేజీ విషయంలో తాను వెళ్ళినప్పుడు ఎదురైన అనుభవాలు,అవమానాల గురించి సన్నిహితులతో చెప్పారంట. అయినా అదేమీ మనసులో పెట్టుకోకుండా సాయం చేస్తున్నట్టు చెప్పారట. ఆనం కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నారాయణ సాయం చేయడానికి ముందుకొచ్చారు. కానీ సీఎం తో సాన్నిహిత్యం ఉందన్న నమ్మకంతో నెల్లూరు జిల్లాలో మరెందరో నాయకుల్ని నారాయణ చిన్న చూపు చూస్తున్నారట!