నెటిజ‌న్ల‌కు క‌మెడియ‌న్లుగా మారిన అఖిల్ – రాహుల్‌

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో స‌మాజ్‌వాదీ పార్టీ ఘోర పరాజయం పార్టీ అధినేత ములాయంసింగ్‌కు, త‌న‌యుడు అఖిలేష్‌యాద‌వ్‌కు పీడ‌క‌ల‌ను మిగిల్చింది. ఇందుకు పార్టీలోని లుక‌లుక‌లు కొద్ది వ‌ర‌కూ కార‌ణ‌మైతే.. కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కూడా మ‌రో కార‌ణం అని చెప్పుకోవ‌చ్చు! అఖిలేష్ రాష్ట్రంలో చేసిన అభివృద్ధిపై అంతో ఇంతో న‌మ్మక‌మున్న వారు కూడా రాహుల్ ఎంట్రీతో బీజేపీ వైపు వెళ్లిపోయారనేది స్ప‌ష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా తానే కాక‌.. త‌న‌ను న‌మ్ముకున్న వారిని కూడా న‌ట్టేట ముంచేశాడు రాహుల్‌! అంతేగాక వారిని చూసి ప్ర‌జ‌లంతా న‌వ్వుకునేలా చేశాడు. వీళ్ళిద్దరినీ కమెడియన్స్‌ని చేస్తూ నెట్‌లో పేలుతున్న జోకులు అయితే మామూలుగా లేవు.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ మొన్నమొన్నటివరకూ కేవలం పార్టీ అభ్యర్థులను, అగ్రనేతలనే కమెడియన్స్‌ని చేసిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు మోడీకి ప్రత్యర్థులుగా ఉన్న అందరినీ కమెడియన్స్‌గా నిలబెట్టేం దుకు గట్టి ప్రయత్నాలేవో చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోకముందు వరకూ అఖిలేష్ యాదవ్ హీరోగానే ఉన్నాడు. ముఖ్యంగా తండ్రి, బాబాయ్‌లతో అఖిలేష్ చేసిన పోరాటం యూపీ యువతకు నచ్చింది. ఆ హీరోయిజం చూసే ఎస్పీ ఎమ్మెల్యేలు కూడా అఖిలేష్‌కి మద్ధతుగా నిలబడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం, ఆ పార్టీకి వందకు పైగా సీట్లు కేటాయించడంతోనే ఎస్పీ గెలుపుపైన బోలెడన్ని సందేహాలు మొద‌ల‌య్యాయి.

రాహుల్ గాంధీతో పొత్తుతో వ‌చ్చిన బలహీనతలు కూడా ఎస్పీ ఓట‌మికి ప్రధాన కారణమయ్యాయి. రాహుల్ గాంధీ ప్రచారం మొదలెట్టిన వెంటనే బీజేపీ నాయకులందరూ మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అంటూ ఇద్దరినీ పోలుస్తూ ప్రచారం చేశారు. మధ్యలో ప్రియాంక గాంధీని రంగంలోకి దింపడం కూడా రాహుల్ అసమర్థతను చాటి చెప్పినట్టైంది.

రాహుల్ లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథీ నియోజకవర్గ పరిథిలో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది అంటే రాహుల్ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

బీహార్‌లో కూడా నితీష్ కుమార్‌ని ముఖ్యమంత్రిగా కోరుకున్నారు కాబట్టే కూటమిని గెలిపించారు బీహారీలు. ఆ విషయం తెలుసుకోకుండా రాహుల్‌గాంధీతో కలిసి బీహార్ మేజిక్‌ని రిపీట్ చేద్దామనుకున్న అఖిలేష్ యాదవ్ అంచనాలన్నీ పూర్తిగా మటాష్ అయ్యాయి. మొత్తానికి మోడీ-అమిత్ షాల అసామాన్య జోడీని ఢీకొట్టడానికి రాహుల్ లాంటి నాయకుడిని వెంటేసుకుని బరిలోకి దిగిన అఖిలేష్ యాదవ్ బొక్కా బోర్లా పడ్డాడు. రాహుల్‌ని ఒక ఆట ఆడుకుంటున్న నెటిజనులకు ఇప్పుడు అఖిలేష్ యాదవ్ కూడా అడ్డంగా దొరికిపోయాడు. రాహుల్ ఐరన్ లెగ్ మహిమ అఖిలేష్ యాదవ్‌ని కూడా కమెడియన్‌ని చేసి పడేసింది అన్నదే జోక్ ఆఫ్ ద డే.