ప‌వ‌న్‌కు రామోజీకి గ్యాప్ ఎందుకు..!

ఈనాడు గ్రూఫ్ అధినేత రామోజీరావు పేరు చెపితే తెలియ‌ని తెలుగు వాళ్లు ఉండ‌రు. తెర‌ముందుకు రాకుండానే తెలుగు రాజ‌కీయాల‌ను శాసించే వ్య‌క్తిగా పేరున్న రామోజీని రాజ‌గురువు అని పిలిచేవాళ్ల సంఖ్య కూడా త‌క్కువేం కాదు. తెలుగు రాజ‌కీయాల్లో రామోజీ చ‌క్రం తిప్ప‌డం దాదాపు గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాల నుంచే ఉంది. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లో సైతం రామోజీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ టీడీపీ+బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తుగా స‌పోర్ట్ చేయ‌డంలో కీ రోల్ పోషించార‌న్న వార్త‌లు కూడా ఉన్నాయి.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచే రామెజీ – ప‌వ‌న్ చాలా స‌న్నిహితంగా ఉంటూ వ‌స్తున్నారు. ఇది తెర ముందు తెర‌వెన‌క కూడా జ‌రుగుతోంది. ప‌వ‌న్ పార్టీ మీటింగుల‌కు ఈనాడు మీడియా సంస్థ‌ల్లో వ‌స్తోన్న అసాధార‌ణ క‌వ‌రేజే కూడా ఇందుకు ఓ నిద‌ర్శ‌నం. త‌ర్వాత ఈటీవీ వాళ్ల ఫంక్ష‌న్ జ‌రిగితే ఆ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ ప్ర‌త్యేక అతిథిగా హాజ‌ర‌య్యాడు. రామోజీ ప‌క్క‌న కూర్చున్నాడు. వారిద్ద‌రు ఏవో గుస‌గుస‌లాడుకున్నారు. ఇవ‌న్నీ వీరిద్ద‌రి మ‌ధ్య సాన్నిహిత్యాన్ని చెపుతున్నాయి.

తాజా ప‌రిణామాలు చూస్తుంటే ప‌వ‌న్‌కు రామోజీకి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చిందా అంటే ? అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తోంది. ప‌వ‌న్ లేటెస్ట్ మూవీ కాట‌మ‌రాయుడు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రిగింది. ఈ ఫంక్ష‌న్‌కు ఎన్టీవీ అధినేత తుమ్మ‌ల న‌రేంద్ర‌చౌద‌రితో పాటు టీవీ-9 సీఈవో ర‌విప్ర‌కాష్ హాజ‌రై అంద‌రికి షాక్ ఇచ్చారు. వీరిద్ద‌రు ప‌వ‌న్‌పై బాగా ప్ర‌శంస‌లు కూడా కురిపించారు.

దీనిపై విన‌ప‌డుతోన్న టాక్ ఏంటంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఎలాగూ జ‌న‌సేన నుంచి ఒంటరిగా పోటీ చేస్తాడు. ప‌వ‌న్‌కు ఈనాడు స‌పోర్ట్ ఎలాగూ ఉండ‌దు. అందుకే ప‌వ‌న్ బ‌ల‌మైన మీడియా స‌పోర్ట్ కోసం త‌న ప్ర‌య‌త్నాలు తాను చేస్తున్నాడ‌ట‌. ఈ క్ర‌మంలోనే ర‌విప్ర‌కాష్ టీవీ-9 నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఎన్టీవీ అధినేత న‌రేంద్ర‌చౌద‌రితో క‌లిసి ఓ ఛానెల్ పెడ‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో ఎన్టీవీ గ్రూఫ్ ప‌వ‌న్‌కు బ‌ల‌మైన స‌పోర్ట్‌గా నిలుస్తుంద‌ని టాక్‌. అందుకే ప‌వ‌న్ రామోజీతో కాస్త దూరం దూరంగా ఉంటున్నార‌ట‌. ఇక ఇప్ప‌టికే ఎన్టీవీలో ప‌వ‌న్‌, జ‌న‌సేన‌కు అనుకూలంగా క‌థ‌నాల వండి వార్పుడు స్టార్ట్ అయిపోయిన‌ట్టు తెలుస్తోంది.