త్వ‌ర‌లో గులాబీ గూటికి డీకే అరుణ వ‌ర్గం

కాంగ్రెస్ పార్టీలో వ‌ర్గ‌పోరు సీఎం కేసీఆర్‌కు వ‌రంలా మారుతోంది, ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీని ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో ఖాళీ చేసిన ఆయ‌న‌.. ఇప్పుడు కాంగ్రెస్‌పై దృష్టిపెట్టబోతున్నార‌ట‌. కాగ‌ల కార్యం గంధ‌ర్వులే తీర్చిన విధంగా.. కాంగ్రెస్‌లో లుక‌లుకలు ఆయ‌న ప‌ని మ‌రింత సుల‌భం చేస్తున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ అంటే ఒంటి కాలిపై లేచే.. డీ కే అరుణ వ‌ర్గానికి ఇప్పుడు కేసీఆర్ గేలం వేస్తున్నార‌ని స‌మాచారం! ఆమె వ‌ర్గానికి చెందిన నేత‌లంతా కేసీఆర్‌ను క‌ల‌వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా గ్రూపు రాజ‌కీయాలు కాంగ్రెస్‌ను వీడ‌టం లేదు. ఇది అధికార టీఆర్ఎస్‌కు లాభిస్తోంది. పాల‌మూరులో వ‌ర్గ విభేదాలు తార స్థాయికి చేరాయి. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైపాల్ రెడ్డి వ‌ర్గానికీ, డీకే అరుణ వ‌ర్గానికి మ‌ధ్య వివాదం బాగా ముదిరిపోయిందనే ప్ర‌చారం జోరందుకుంది. కాంగ్రెస్ ఎంపీ ఎల్ల‌య్య‌, డీకే అరుణ‌, చిన్నారెడ్డి, సంప‌త్‌, వంశీ చంద్ రెడ్డి.. సీఎం కేసీఆర్‌తో ఉగాది రోజు భేటీ అయ్యారు. పాత మ‌హ‌బూబ్ న‌గ‌ర్ అభివృద్ధి గురించి చ‌ర్చించేందుకు అని చెబుతున్నా.. దీని వెనుక క‌థ మాత్రం వేరే ఉంద‌ట‌.

జైపాల్ రెడ్డి, డీకే అరుణ వ‌ర్గానికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత‌గా విభేదాలు పెరిగిపోయాయ‌ట‌. ఆయ‌న న‌ల్గొండ కాంగ్రెస్ నాయ‌కుల‌ను మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని అరుణ వ‌ర్గ‌పు నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నార‌ట‌. అర్హులైన నాయ‌కులున్నా.. పీసీసీ ప‌దవిని పాల‌మూరుకు ద‌క్క‌కుండా చేస్తున్నార‌ని వారు అనుమానిస్తున్నార‌ట‌. అందుకే ఇక అమీతుమీకి సిద్ధ‌మ‌య్యార‌ని నేత‌లు చెబుతున్నారు. ఇక పార్టీలో ఉంటే క‌ష్ట‌మ‌ని వారంతా భావిస్తున్నార‌ట‌. అందుకే సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యార‌ని అంత‌ర్గ‌తంగా వినిపిస్తోంది.

అరుణ అండ్ టీం ఇప్పుడు టీఆర్ఎస్‌లో చేర‌తారా లేదా అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది, ఇప్ప‌టికే కేసీఆర్‌పై విరుచుకుప‌డే అరుణ కూడా వెళిపోతే.. కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్టే! ఈ విష‌యంపై మ‌రికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.