టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు బీజేపీ గాలం..!

యూపీ ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం త‌ర్వాత బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ఆప‌ర‌ష‌న్ తెలంగాణ మీదే ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవ‌డం లేదా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా టీఆర్ఎస్‌కు ధీటుగా ఉండేలా అమిత్ ప్లాన్లు వేస్తున్నార‌ట‌. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. 2019 ఎన్నిక‌ల నాటికి బీజేపీ ఫ‌స్ట్ ప్ర‌యారిటీ తెలంగాణ‌లో అధికారంలోకి రావ‌డంతో పాటు అక్క‌డ నుంచి వీలున్న‌న్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవ‌డం.

అలా కుద‌ర‌ని ప‌క్షంలో క‌నీసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా బ‌లంగా ఉండ‌డంతో పాటు ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా క‌న‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే అమిత్ షా టీ కాంగ్రెస్‌లో సీనియ‌ర్ల‌తో పాటు కొంద‌రు ఎమ్మెల్యేల‌కు సైతం గాల‌మేస్తున్న‌ట్టు టీ పాలిటిక్స్ రాజ‌కీయాల్లో జోరుగా చ‌ర్చ‌లు వినిపిస్తున్నాయి.

టీ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ అయిన గ‌ద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ‌తో పాటు అదే జిల్లాకు చెందిన ఆలంపూర్ ఎమ్మెల్యే సంప‌త్‌కుమార్‌, క‌ల్వ‌కుర్తి ఎమ్మెల్యే వంశీచంద‌ర్‌రెడ్డి, వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డిలకు అమిత్ షా క్యాంపు నుంచి ఫోన్లు వ‌స్తున్నాయ‌ట‌. గ‌త ఎన్నిక‌ల్లో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో బీజేపీ సీట్లు గెల‌వ‌క‌పోయినా గ‌ణ‌నీయ‌మైన సంఖ్య‌లో ఓట్లు సాధించింది. ఈ క్ర‌మంలోనే గ్రేట‌ర్ హైద‌రాబాద్ త‌ర్వాత బీజేపీ రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల‌ను మెయిన్‌గ టార్గెట్ చేసుకుంది.

కాంగ్రెస్‌కు వ‌చ్చే పదేళ్ల‌పాటు దేశంలో ఎక్క‌డా ఫ్యూచ‌ర్ ఉంటుంద‌న్న గ్యారెంటీ లేదు. ఈ క్రమంలోనే పైన చెప్పుకున్న ఎమ్మెల్యేల‌కు కీల‌క పోస్టుల‌తో పాటు పార్టీ జిల్లా ప‌గ్గాలు ఇస్తామ‌ని ఆఫ‌ర్లు ఇస్తుండ‌డంతో వారంతా పార్టీ మారే విష‌యమై డైల‌మాలో ఉన్నార‌ట‌. వీరంతా ఒక్కొక్క‌రుగా పార్టీ మార‌డం కంటే అంద‌రూ క‌లిసి పార్టీ మారితేనే బాగుటుంద‌ని ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. ఒక‌టి రెండు నెల‌ల్లోనే ఈ ఆప‌రేష‌న్ స‌క్సెస్ కావ‌చ్చని, టీ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి భారీగా జంపింగ్‌లు ఉంటాయ‌ని తెలుస్తోంది.