చంద్ర‌బాబు సేఫ్ గేమ్‌లో విన్న‌ర్ వైసీపీనా?

మొత్తానికి టీడీపీపై వైసీపీ ఆధిప‌త్యం సంపాదించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఏడో స్థానం ఎవ‌రు గెలుస్తారో అనే ఉత్కంఠ‌కు తెర‌దించింది. ఏడు స్థానాల్లో ఐదింటిని టీడీపీ గెలుచుకున్నా.. మిగిలిన రెండు స్థానాల‌ను ద‌క్కించుకుంది. దీంతో త‌మ‌కు బ‌లం లేక‌పోయినా రెండో సీటును గెలుచుకుని.. టీడీపీపై పైచేయి సాధించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఏడుగురు అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు!! అయితే ఇందులో టీడీపీ అధిక స్థానాలు గెలుచుకున్నా.. నైతికంగా టీడీపీపై వైసీపీ విజ‌యం సాధించిన‌ట్ట‌యింది.

ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు మొదలైన నాటి నుంచి ఆరో అభ్య‌ర్థిని రంగంలోకి దింపుతామ‌ని టీడీపీ నాయ‌కులు ప్ర‌క‌టించారు. ఆరో అభ్య‌ర్థిని గెలిపించుకునేందుకు అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తు లేక‌పోయినా.. ఆరో అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌డంపై పార్టీలో తీవ్రంగా చ‌ర్చ జ‌రిగింది. దీంతో వైసీపీ నుంచి మళ్లీ ఫిరాయింపులు ఉంటాయని.. ఆ నమ్మకంతోనే చంద్రబాబు ఆరో అభ్యర్థిని పోటీకి దించాలనుకుంటున్నారన్న ప్రచారం జోరుగా జరిగింది. అంతేకాదు.. టీడీపీలోకి వెళ్తున్న ఎమ్మెల్యేలు ఎవరా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.

అయితే అసలు సీను మాత్రం వేరే ఉంద‌ట‌. టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పార్టీలోకి వెళ్లేందుకు వైసీపీ నుంచి ఎవరూ ఆసక్తి చూపలేదట. దీంతో పాటు త‌న త‌న‌యుడు లోకేష్‌ను కూడా ఈ సారి రంగంలోకి దించుతున్నారు. దీంతో ఆరో అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా రిస్క్ తీసుకునేందుకు చంద్రబాబు సిద్ధపడలేదని చెబుతున్నారు. కుమారుడి ఎన్నిక ఏకగ్రీవంగా సురక్షితంగా జరగాలన్న ఉద్దేశంతోనే ఆరో అభ్యర్థిని చంద్రబాబు బరిలో దింపేందుకు సాహసించ లేదంటున్నారు. ఏది ఏమ‌యినా చివ‌రి నిమిషంలో.. టీడీపీ వెన‌క‌డుగు వేసింది. ఆరో స్థానం ఆశలను పక్కనపెట్టేసి అయిదు స్థానాలతో సరిపెట్టుకుంది.

నామినేషన్ల గడువు ముగిసే సరికి టీడీపీ నుంచి ఐదుగురు – వైసీపీ నుంచి ఇద్దరు నామినేషన్ వేశారు. ఏడు స్థానాలకు ఏడు నామినేషన్లు మాత్రమే నమోద‌వ‌డంతో ఓటింగ్ లేకుండానే అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ నుంచి గంగుల – ఆళ్ల నాని ఇద్దరూ ఎమ్మెల్సీలుగాఎన్నికయ్యారు. టీడీపీ నుంచి లోకేష్ – కరణం బలరాం – పోతుల సునీత – బత్తుల అర్జునుడు – డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎవరూ నామినేషన్ వేయడానికి ఇక చాన్సు లేకపోవడంతో ఈ అయిదుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. త్వ‌ర‌లో అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు.