చంద్ర‌బాబు త‌న `ప్ర‌చార స్థాయి` మ‌రో మెట్టుకు .. సందేహం లేదు!

రాష్ట్రానికి ఏ చిన్న అవార్డు ద‌క్కినా అది త‌న వ‌ల్లే అని `ప్ర‌చారం` చేసుకోవ‌డంలో ఏపీ సీఎం చంద్ర‌బాబును మించిన వారు ఉండ‌రు. ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి మొద‌లుకుని వృద్ధి రేటు వ‌ర‌కూ అన్నీ త‌న‌వ‌ల్లే అని గొప్ప‌లు చెప్పుకోవ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. వ‌చ్చేది గోరంత‌యినా.. దానిని కొండంత‌గా చేసి అందుకు రెండింత‌లు ప్ర‌చారం చేసుకునే ఆయ‌న‌కు.. మ‌రో కొత్త లైన్ దొరికింది, సీఎన్‌బీసీ టీవీ 18.. రాష్ట్రానికి `స్టేట్‌ ఆఫ్ ద ఇయ‌ర్‌` అవార్డు ప్ర‌క‌టించింది. ఈ అవార్డు తీసుకోవ‌డానికి చంద్ర‌బాబుకు ఆహ్వానం కూడా పంపింది. దీంతో చంద్ర‌బాబు త‌న `ప్ర‌చార స్థాయి`ని మ‌రో మెట్టుకు తీసుకువెళ‌తార‌న‌డంలో సందేహం లేదు!

పెద్ద నోట్లు ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోడీ ఢిల్లీలో అలా ప్ర‌క‌టించారో లేదో.. వెంట‌నే చంద్ర‌బాబు మీడియా ముందుకు వ‌చ్చారు. పెద్ద నోట్ల‌తో ఆర్థిక వ్య‌వ్య‌స్థ‌కు న‌ష్టం క‌లుగుతోంద‌ని వివ‌రిస్తూ తాను లేఖ‌రాశాన‌ని.. దీంతో మోడీ ఈ నిర్ణ‌యం తీసుకున్నారని ప్ర‌క‌టించేశారు. రియో ఒలింపిక్స్‌లో పివి సింధు ప‌త‌కం సాధించింది.. అనంత‌రం తాను గోపీచంద్‌కు స్థ‌లం కేటాయించాన‌ని, దాని వ‌ల్లే సింధులాంటి వాళ్లు ప‌త‌కాలు సాధించార‌ని చెప్పుకొచ్చారు చంద్ర‌బాబు! ఈజ్ఆఫ్ డూయింగ్‌లో తొలి స్థానంలో ఉంద‌ని.. అది కూడా తాము ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల వ‌ల్లేన‌ని మాట‌లు కోట‌లు దాటించేశారు. ఇలా ప్ర‌తి అంశాన్ని త‌న‌కు అనుకూలంగా ప్ర‌చారం చేసుకోవ‌డంలో దిట్ట‌.

తాజాగా, ఈ స్టేట్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు వ‌చ్చింది. రాష్ట్రంలో టెక్నాల‌జీ వాడ‌కం అద్భ‌తంగా ఉంద‌నీ, స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వం రాష్ట్రంలో ఉంద‌నీ, వృద్ధి రేటు కూడా బాగుంద‌నీ.. ఇలాంటి కొన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఏపీకి స్టేట్ ఆఫ్ ద ఇయ‌ర్‌ అవార్డు ఇచ్చారంటూ ప్ర‌భుత్వ మీడియా స‌ల‌హాదారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ చెప్పారు. ప్ర‌పంచానికి చంద్ర‌బాబు చూపుతున్న ఆంధ్రా అభివృద్ధి అంతా కేవ‌లం ప్రెజెంటేష‌న్ల‌కే ప‌రిమితం అవుతోంద‌న్న విమ‌ర్శ వినిపిస్తూనే ఉంది.

రాజ‌ధాని నిర్మాణం మొద‌లు కాలేదు. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీలు ఇంకా పూర్తి స్థాయిలో అమ‌లు కాలేదు. రాష్ట్రంలో రైతాంగం ఇబ్బందుల్లో ఉంది. ప్ర‌త్యేక హోదా అట‌కెక్కిపోయింది. ప్యాకేజీకి చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఏమైందో.. ఎవ్వ‌రికీ తెలీదు. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు గ‌ణ‌నీయంగా మారిపోయిన ప‌రిస్థితేం లేదు! వీట‌న్నింటికీ కప్పిపుచ్చుతూ… ఆంధ్రా అద్భుతః అని బ‌య‌ట ప్ర‌పంచానికి చూపుతున్నారు. ఆంధ్రాకు అవార్డు రావ‌డాన్ని లేదా గుర్తింపు ల‌భించ‌డాన్ని ఎవ్వ‌రూ త‌ప్పుబ‌ట్ట‌డం లేదు. కానీ, అలాంటి గుర్తింపుల కోసం మాత్ర‌మే చంద్ర‌బాబు స‌ర్కారు పాకులాడుతున్న‌ట్టుగా ఉంది.