గంటా వివాదాస్ప‌ద నిర్ణ‌యం తెలిస్తే షాకే

`వ‌డ్డించే వాడు మ‌న‌వాడైతే… ` అనే నానుడిని గుర్తుచేస్తున్నారు ఏపీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు! ఇప్ప‌టికే ప‌లు వివాదాల్లో చిక్కుకున్న ఆయ‌న‌.. మరో కొత్త సంస్కృతికి తెర‌తీశారు! త‌న‌కు న‌చ్చిన‌ వారికి ఎన్ని ప‌ద‌వుల‌నైనా క‌ట్ట‌బెట్టి అంద‌ల మెక్కించేస్తున్నారు. ఇదేమిట‌ని ప్ర‌శ్నిస్తే.. తేలిక‌గా కొట్టిపారేస్తున్నారు. మంత్రుల వ‌ద్ద అధికారులుగా ప‌నిచేసే వ్య‌క్తులు.. మ‌రే ఇత‌ర శాఖ‌ల్లోనూ ప‌నిచేయ‌కూడ‌దు. కానీ గంటా శ్రీ‌నివాస‌రావు శాఖ‌లో మాత్రం ఇది వ‌ర్తించ‌ద‌ని రుజువైంది. త‌న పీఎస్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న నాయుడుని.. రాజీవ్ విద్యామిష‌న్ కార్యాల‌యంలో ఇన్‌చార్జి చీఫ్ ఇంజ‌నీర్‌గా నియ‌మించ‌డం ఇప్పుడు వివాదాస్ప‌ద‌మ‌వుతోంది.

గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని ఇంజనీరింగ్‌ విభాగంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న నాయుడుని మంత్రి గంటా తన అంతరంగిక కార్యదర్శిగా నియమించుకున్నారు. అంతకు ముందు తాను నిర్వహించిన ఎగ్జిక్యూటివ్‌ పోస్టులో మరొకరిని నియమించేందుకు నాయుడు సిఫార్సు చేశారు. దీని వెనుక సుమారు రూ.25లక్షల వ‌ర‌కూ చేతులు మారాయట. మంత్రిగా కార్యాలయంలో పిఎస్‌గా నాయుడు నియామకం అయిన తరువాత ఆయన పరిస్థితి మూడు పువ్వులు..ఆరు కాయలన్నట్లుగా ఉంది. పేషిలో ‘నాయుడు’ అంతా తానై వ్యవహరించారు. ఇప్పుడు రాజీవ్‌విద్యామిషన్‌లో చీప్‌ ఇంజనీర్‌ పోస్టు ఖాళీగా ఉండడంతో ఆయ‌న క‌న్ను ఆ పోస్టుపై ప‌డిందట‌.

ఇప్పుడు మ‌ళ్లీ చక్రం తిప్పారు. నిబంధనలకు తూట్లు పొడిచారు..ముఖ్యమంత్రి దృష్టికి పోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇన్‌ఛార్జి చీఫ్‌ ఇంజనీర్‌ పోస్టు ఆయనను వరించింది. అక్కడ నుంచి ఆయన మరింత విజృంభించారు.

రాజీవ్ విద్యామిషన్‌ నుంచి ప్రభుత్వానికి వచ్చే ప్రతిపాదనలన్నీసచివాలయపరిధిలో అనుమతులు ఆయనే ఇప్పించేవారు. కింది నుంచి ప్రతిపాదనలు ఆయన పంపుతారు. పైనుంచి ఆమోదాలు లభించేవిధంగా ఈయన చక్రం తిప్పుతారు..ఈ మొత్తం వ్యవహారంలో కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

గతంలో డైరెక్టరేట్‌, కమిషనరేట్‌ కార్యాలయాల్లో కమిషనర్‌గా, డైరెక్టర్‌గా బాధ్య‌తలు నిర్వహిస్తున్న అధికారుల్లో కొందరిని సచివాలయంలో ఎక్స్‌అఫీషియో హోదాలో, డిప్యూటీ సెక్రటరీగానీ, అడిషనల్‌ సెక్రటరీగానీ నియమించేవారు. దీనిపై ఉద్యోగుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆ విధంగా నియమితులైన వారు సచివాలయానికి రాకుండా డైరెక్టరేట్‌, కమిషనరేట్‌ కార్యాలయాలకే పరిమితం కావడంతో ప్రభుత్వం ఎక్స్‌అఫీషియో హోదాను రద్దు చేసింది. కానీ ఆ విధానమనేది ఏదీ లేకుండానే నాయుడును మంత్రి గంటా శ్రీనివాసరావు తన పిఎస్‌గా నియమించుకోవడంలో తప్పులేదు కానీ ఈవో హోదాలో ఉన్న అధికారిని ఇన్‌ఛార్జి చీఫ్‌ ఇంజనీర్‌గా నియమించడంలోని మతలబు ఏమిటన్న‌దే ఇప్పుడు అస‌లు ప్ర‌శ్న!!