కాంగ్రెస్ పీఎం అభ్య‌ర్థిగా శ‌శిథ‌రూర్‌..!

125 ఏళ్ల ఘ‌న చ‌రిత్ర ఇప్పుడు క‌నుమ‌రుగు అయిపోయింది! ఎంద‌రో గొప్ప‌ నాయ‌కుల‌ను అందించిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు ఒకే ఒక్క నాయ‌కుడి కోసం వెతుకుతోంది!! మ‌రో ప‌క్క ప్ర‌ధాని మోదీ బ‌లం రెట్టింపు అవుతుంటే.. కాంగ్రెస్ భావి సార‌థి ఇంకా ఇంకా అథఃపాతాళానికి ప‌డిపోతున్నారు. మ‌రి 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని అభ్య‌ర్థిగా రాహుల్ ను ప్ర‌క‌టిస్తే అది పార్టీకి న‌ష్ట‌మ‌ని ఇప్ప‌టికే అందరికీ అర్థ‌మైంది. మ‌రి ఈ స‌మ‌యంలో కాంగ్రెస్ పీఎం అభ్య‌ర్థిగా ఎంపీ శ‌శిథ‌రూర్ పేరు వినిపిస్తోంది. అయితే తొలిసారి గాంధీ కుటుంబం నుంచి కాకుండా.. వేరే వ్య‌క్తిని పీఎంగా ప్ర‌క‌టిస్తారా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశమైంది.

గాంధీ కుటుంబం నుంచి పీఎం పీఠంపై ఎవ‌రూ ఎక్క‌పోయినా.. ముందు ఎవ‌రో ఒక‌రిని ఉంచి, వారిని కీలుబొమ్మ‌ల‌ను చేసి.. వెనుక నుంచి అధినేత్రి సోనియాగాంధీ అన్ని వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెడుతుంటారు. అయితే ఈసారి ఆమె త‌న‌యుడు రాహుల్ గాంధీనే ప్ర‌ధాని అభ్య‌ర్థిని చేయాల‌ని ఆమె దృఢంగా నిశ్చ‌యించుకున్నారు. కానీ నాయ‌కుడిగా ఇంకా పూర్తిగా ఎద‌గ‌ని ఆయ‌న్ను పీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించి బ‌రిలోకి దిగాలంటే.. అది క‌త్తి మీద సాములాంటిదే!! ప్ర‌స్తుతం యూపీ ఎన్నిక‌ల్లో రాహుల్‌, ప్రియాంకా గాంధీ ప్ర‌చారం నిర్వ‌హించినా.. త‌మ సొంత నియోజ‌క‌వ‌ర్గాల్లోనే అభ్య‌ర్థుల‌ను గెలిపించుకోల‌ని ప‌రిస్థితి! ఈ నేప‌థ్యంలో కొత్తగా శ‌శిథ‌రూర్ పేరు ఆన్‌లైన్‌లో వినిపిస్తోంది.

2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థిగా శశిథరూర్‌ పేరును ప్రకటించాలని ఆన్‌లైన్‌లో ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని తిరువనంతపురానికి చెందిన వ్యక్తి ఒకరు ప్రారంభించారు. ‘‘శశిథరూర్‌ అత్యున్నత విద్యార్హతలతోపాటు.. జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో అద్భుతమైన పరిజ్ఞానం కలిగి ఉన్నారు. ఆయనకు దేశ ప్రజలతోపాటు, ప్రపంచ నాయకులతోనూ మంచి సంబంధాలున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ఆయన పిటిషన్‌కు 6,725 మంది నెటిజన్లు మద్దతు పలికారు. మ‌రి ఒక‌వేళ థ‌రూర్ క‌నుక సీన్‌లోకి వ‌స్తే.. రాహుల్‌, ప్రియాంక ప‌రిస్థితి ఎలా ఉంటుంది. రాహుల్‌కి బ‌దులు ప్రియాంకా గాంధీకి ప‌గ్గాలు అప్ప‌జెప్పాల‌ని భావిస్తున్న వారు కూడా లేక‌పోలేరు. మ‌రి ఏం జ‌రుగుతుందో వేచి చూడాల్సిందే!!