కేసీఆర్-ప‌రిపూర్ణానంద భేటీ వెనుక‌ వ్యూహం ఇదే.. 

తన వ్యూహాల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేస్తూ.. ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త వ్య‌క్తిని చూపిస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్! భ‌విష్య‌త్తులో చేప‌ట్టబోయే కార్య‌క్ర‌మాల‌కు అడ్డంకులు క‌ల‌గ‌కుండా ఆయ‌న నిర్ణ‌యాలు తీసుకుంటారు. అంత అడ్వాన్స్‌గా ప‌రిణామాల‌ను ఊహిస్తారు క‌నుక ప్ర‌త్య‌ర్థుల‌కు అంద‌కుండా ఎదిగిపోయారు. ఇప్పుడు ఆయ‌న ప‌రిపూర్ణానంద స్వామిని అక‌స్మాత్తుగా కల‌వడం అంద‌రినీ విస్తుగొలుపుతోంది! సాధార‌ణంగానే ఆధ్యాత్మిక భావం ఎక్కువగా ఉన్న కేసీఆర్ స్వ‌యంగా ప‌రిపూర్ణానంద‌ను క‌ల‌వ‌డం వెనుక రాజ‌కీయ కోణం కూడా ఉంద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం!

ఇటీవ‌లే.. దూకుడు పెంచిన కాంగ్రెస్‌కు బ‌డ్జెట్ కేటాయింపుల ద్వారా క‌ళ్లెం వేయ‌గ‌లిగారు కేసీఆర్‌. ఇప్పుడు అదే ఊపులో.. రాష్ట్రంలో మ‌త ప్రాతిప‌దిక రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేందుకు కేసీఆర్ స‌ర్కారు సంసిద్ధ‌మవుతోంది. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ ప్ర‌కారం ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేందుకు తెరాస ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో భాజ‌పా నాయ‌కులు దీన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. మ‌త ప్రాతిప‌దిక రిజ‌ర్వేష‌న్లు ఏంటంటూ హిందూ సంఘాలు కొన్ని కాస్త హ‌డావుడి చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వారి నోళ్లు మూయించాలంటే… ఏదో ఒక చెక్ పాయింట్ అవ‌స‌రం!

దేవాల‌యాల‌కు మొక్కులు చెల్లింపు పేరుతో భారీ ఎత్తున కానుక‌లిచ్చారు కేసీఆర్‌. వ్య‌క్తిగ‌త మొక్కుల చెల్లింపుల‌కు ప్ర‌జాధానం దుర్వినియోగం చేయ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు అంటూ కొంత వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఈ త‌రుణంలో కేసీఆర్‌కు మ‌ద్ద‌తు నిలిచారు ప‌రిపూర్ణానంద‌. అందుకే త‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన స్వామీజీని క‌లిసేందుకు కేసీఆర్ స్వ‌యంగా వ‌చ్చారు. ఒక టీవీ ఛానెల్‌కు ఆయ‌న వ‌చ్చార‌న్న స‌మాచారం తెలుసుకుని కేసీఆర్ స్వ‌యంగా వెళ్లారు. అంతేకాదు, ఆయ‌న చెప్పిన ఆర్థిక క‌ష్టాలు కొన్ని విని… తోచిన సాయం ప్ర‌క‌టించారు. సో.. ఆయ‌న్ని క‌ల‌వ‌డం వెన‌క స్వ‌కార్యంతోపాటు, స్వామి కార్యం కూడా అవుతుంద‌ని కేసీఆర్ భావించార‌ట‌.

అంది వ‌చ్చిన అవ‌కాశాన్ని ఇలా వాడుకుని.. కృత‌జ్ఞ‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తూనే, చేయాల్సిన రాజ‌కీయానికి అనుగుణంగా ప‌రిస్థితిని మ‌లుచుకున్నార‌ని కూడా కొంతమంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతేగాక తెలంగాణ‌లో భాజ‌పా నాయ‌కుల‌ నోటికి తాళం వేయించ‌డ‌మే… ప‌రిపూర్ణానందతో క‌ల‌యిక వెన‌క మ‌ర్మం అనే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాల‌ని, త‌దుప‌రి ల‌క్ష్యం టీఆర్ఎస్ అని ఊహాగానాలు వినిపిస్తున్న స‌మ‌యంలో.. కేసీఆర్ నిర్ణ‌యం బీజేపీ నేత‌ల‌కు మింగుడుప‌డ‌ని అంశ‌మే!!