ఏపీ మంత్రి వ‌ర్గంలో `ఫ్యామిలీ` రాజ‌కీయాలు

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ముందు.. మంత్రుల గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి! అస‌లే మంత్రి ప‌దవి ఉంటుందో ఊడుతుందో తెలియ‌క ఒక‌ప‌క్క తీవ్రంగా ఆందోళ‌న చెందుతుంటే.. ఇప్పుడు వారిపై ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు నివేదిక రూపొందించి.. సీఎం చంద్ర‌బాబుకు అందించాయి. దీంతో అందులో ఏముందో తెలియక మంత్రులు ఒకటే టెన్ష‌న్ ప‌డుతున్నారు. మంత్రులుగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నా.. వెన‌కాల ఉండి చ‌క్రం తిప్పేదంతా వార‌సులేన‌నే విష‌యం ఈ నివేదిక ద్వారా వెలుగులోకి వ‌చ్చింద‌ట‌. వార‌సులే చ‌క్రం తిప్పుతున్నార‌ని, మంత్రులంతా డ‌మ్మీలేన‌ని.. ముఖ్యంగా ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లోనూ వార‌సుల జోక్యం ఎక్కువ‌గా ఉంద‌ని తేలింద‌ట‌.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో `ఫ్యామిలీరాజ్` నడుస్తోందని సర్కారుకు నివేదిక అందింది. సీనియర్ మంత్రులు మొదలుకుని జూనియర్ మంత్రుల వరకూ ఇదే వరస. కీలక శాఖల్లో మంత్రుల కుమారులు….సోదరులు పెత్తనం చెలాయిస్తున్నారు. రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బి) శాఖలో మంత్రి సిద్ధా రాఘవరావు అల్లుడు.. పేషీలోని మరో వ్యక్తి పూర్తి స్థాయిలో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికితోడు రాష్ట్రంలోని అన్ని రహదారులపై మార్కింగ్ కాంట్రాక్టును బినామీ పేరుతో ఆయ‌న అల్లుడే దక్కించుకున్నారని ఆ శాఖ వర్గాలే చెబుతున్నాయి. మరో మంత్రి పత్తిపాటి పుల్లారావు భార్య.. మాటే జిల్లాలో వేదంగా సాగుతోందని..అధికారులను కూడా ఆమె బెదిరిస్తున్నార‌ట‌.

రెవెన్యూ మంత్రి కె ఈ కృష్ణమూర్తి తనయుడు…తమ్ముడు శాఖా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారట‌. యనమల రామకృష్ణుడు తమ్ముడు జిల్లాలో అన్న పేరు అక్రమాలకు పాల్పడుతున్నార‌ట‌. కిమిడి మృణాళిని తరపున శాఖ వ్యవహారాలన్నీ ఆమె భర్తే నిర్వహిస్తున్నారట‌. పరిటాల సునీత త‌న‌యుడు ఆమె తరఫున జిల్లాలో వ్యవహారాలన్నీ చ‌క్క‌బెతున్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు.. శాఖా వ్యవహారాలు మొదలుకుని..పోస్టింగ్ లు..కాంట్రాక్టుల విషయంలో మంత్రి తనయుడి జోక్యం జోరుగా సాగుతోందని సర్కారుకు నివేదిక అందింది. మరో మంత్రి గంటా శ్రీనివాసురావు బంధుగణం కూడా మంత్రి పేరు చెప్పి రెచ్చిపోతున్నారని చెబుతున్నారు.

వైద్య ఆరోగ్య శాఖలో మంత్రి కామినేని శ్రీనివాసరావు తనయుడు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తరపున ఆయన మామ నడికుదిడి నరసింహరావులు వ్యవహారాలు చక్కబెడుతున్నారట .అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడిపై ఆరోపణలు జోరుగానే విన్పిస్తున్నాయి. మరి ఈ ఫ్యామిలీ రాజ్ పై చంద్రబాబు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విస్తరణ ద్వారా చంద్రబాబు కొంత మందికి అయినా స్పష్టమైన సంకేతాలు పంపాలనే యోచనలో ఉన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.