ఏపీలోమండ‌లి ఛైర్మ‌న్ ప‌ద‌వి రేస్ లో అదృష్టవంతులెవరో..!

ఏపీలో కుల రాజ‌కీయాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా కీల‌క ప‌ద‌వుల‌న్నీ ఒకే వ‌ర్గానికి చెందుతున్నాయ‌నే విమ‌ర్శ మూట‌గ‌ట్టుకుంటోంది టీడీపీ. త‌మ సామాజిక‌వ‌ర్గాల‌కు ఎప్పుడూ అన్యాయం జ‌రుగుతోంద‌ని కొన్ని వ‌ర్గాలు బాహాటంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా అంత‌ర్గ‌తంగా మ‌థ‌న‌ప‌డుతూనే ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌వీ కాలం కూడా పూర్త‌వ‌బోతోంది.  ఈ నేప‌థ్యంలో ఈ ప‌ద‌వి ఎవ‌రికి దక్క‌తుంద‌నే చ‌ర్చ మొద‌లైంది. ముఖ్యంగా రెడ్డి. క్ష‌త్రియ వ‌ర్గానికి చెందిన నేత‌లు ఇప్పుడు.. ఈ ప‌దవిపై ఆశ‌పెట్టుకున్నారు. దీంతో ఈ రెండు వ‌ర్గాల్లో ఎవ‌రిని ఈ ప‌ద‌వి వ‌రిస్తుందోన‌నే చ‌ర్చ మొదలైంది.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముసిగింది. ఆశించిన ఆధిక్యాన్ని పార్టీ ద‌క్కించుకుంది. ఈ లెక్క ప్ర‌కారం మండ‌లి ఛైర్మ‌న్ ప‌ద‌వి టీడీపీకే ద‌క్కించుకోవాలి. అయినాస‌రే, కాంగ్రెస్ కు చెందిన చ‌క్ర‌పాణి ఇంకా ఛైర్మ‌న్ గా కొన‌సాగుతున్నారు. త్వ‌ర‌లోనే ఆయ‌న ప‌ద‌వీ కాలం పూర్త‌వుతుంది. దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ నాయ‌కుడికి… ఏ సామాజిక వ‌ర్గానికి చెందినవారికి ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వాల‌నే చ‌ర్చ టీడీపీలో జోరుగా జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం… రెడ్డి సామాజిక వ‌ర్గానికి లేదా, క్ష‌త్రియుల‌కు అవ‌కాశం ఇవ్వొచ్చ‌నేది తెలుస్తోంది.

రెడ్డి సామాజిక వ‌ర్గంలో చాలామందికి టీడీపీపై వ్య‌తిరేక‌త ఉంది. పార్టీలో త‌మ‌కు ప్రాధాన్య‌త ద‌క్క‌డం లేద‌నే అభిప్రాయం ఉంది. దీంతో ముందుగా సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి రేసులోకి వ‌స్తున్నారు. ఎన్నోయేళ్లుగా పార్టీకి అండ‌గా ఉంటున్నారు. సో.. సోమిరెడ్డికి ఛాన్సులున్నాయి. ఆశావ‌హుల్లో గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు కూడా ఉన్నార‌ట‌! అయితే, ఆయ‌న‌కి ఛాన్సులు త‌క్కువే అని చెప్పాలి. ఓ ప‌క్క శాస‌న స‌భ‌కు కోడెల స్పీక‌ర్ గా ఉన్నారు. మండ‌లిలో గాలికి అవ‌కాశం ఇస్తే… అక్క‌డా ఇక్క‌డా ఒకే సామాజిక వ‌ర్గం నేత‌ల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అవుతుంది.

ఇక‌, మిగిలింది ఉత్త‌రాంధ్ర‌కు చెందిన శ‌త్రుచ‌ర్ల విజ‌య‌రామ‌రాజు! నిజానికి ఆయ‌న ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు కాస్త దూరంగా ఉన్నారు. ఉత్త‌రాంధ్రాలో గ్రూపు రాజ‌కీయాలు పెరుగుతున్న నేప‌థ్యంలో శ‌త్రుచ‌ర్ల‌ను తెర‌మీదికి తీసుకుని వ‌స్తే బాగుంటుంద‌నే అభిప్రాయం కూడా ఉన్న‌ట్టు స‌మాచారం! దీంతో ఆయ‌న పేరు కూడా ప్ర‌ముఖంగానే వినిపిస్తోంది. ఛైర్మ‌న్ ప‌ద‌వి రాజుగారికా, రెడ్డిగారికా అనేది త్వ‌ర‌లోనే తేలిపోనుంది.