ఆర్‌కె.న‌గ‌ర్ బ‌రిలో మ‌హామ‌హులు…ర‌స‌వ‌త్త‌రంగా బై ఎల‌క్ష‌న్‌

త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక కోసం అధికార‌, ప్ర‌తిప‌క్షంతో పాటు బీజేపీ నుంచి మ‌హామ‌హులు రంగంలో ఉండ‌నున్నారు. దీంతో గెలుపోట‌ముల‌పై ఎవ్వ‌రూ అంచ‌నాల‌కు రాలేక‌పోతున్నారు.

అధికార అన్నాడీఎంకే నుంచి పార్టీని తెర‌వెన‌క ఉండి అంతా న‌డిపిస్తోన్న శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఇక మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీరు సెల్వం వ‌ర్గం నుంచి కూడా కీల‌క వ్య‌క్తి రంగంలోకి దిగారు. గతంలో అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌గా పోటీ చేసిన ఇ. మధుసూదనన్‌ను త‌మ వ‌ర్గం అభ్య‌ర్థిగా పోటీ చేయిస్తోన్న విష‌యాన్ని ప‌న్నీరు సెల్వం ప్ర‌క‌టించారు.

అధికార పార్టీలో రెండు వ‌ర్గాల నుంచి కీల‌క వ్య‌క్తులు బ‌రిలో ఉండ‌గా ఇక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన డీఎంకే నుంచి మరుతు గణేశ్ పోటీలో ఉండబోతున్నారు. బీజేపీ నుంచి ప్రముఖ సినీనటి గౌతమి పేరు వినిపిస్తోంది. విజ‌య్‌కాంత్ పార్టీ కూడా పోటీ చేస్తోంది. వీరితో పాటు జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ పోటీ చేస్తారా లేదా అన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

దీపా జ‌య‌కుమార్ పార్టీ పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించినా దానిపై ఇంత వ‌ర‌కు క్లారిటీ రాలేదు. ఇక అన్నాడీఎంకే నుంచి బ‌రిలో ఉన్న శశి మేన‌ల్లుడు దిన‌క‌ర‌న్ ఈ ఎన్నిక‌ల్లో గెలిచి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చి…ఆర్థిక‌మంత్రి ప‌ద‌వి పొందే ప్లాన్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. తాను 50వేల ఓట్ల మెజారిటీతో నెగ్గుతానని దినకరన్ ధీమాగా చెబుతున్నారు. ఇక అన్నాడీఎంకే పార్టీ గుర్తయిన రెండాకుల కోసం ప‌ళ‌ని వ‌ర్గం, ప‌న్నీరు వ‌ర్గం పోటీప‌డుతున్నాయి.

మ‌రో వైపు బీజేపీ నుంచి గౌత‌మి ఎంట్రీతో ఈ పోటీకీ మ‌రో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ వ‌చ్చింది. ఇలా అంద‌రూ మ‌హామ‌హులు పోటీప‌డుతోన్న ఆర్‌కె.న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో ఎవ‌రు గెలుస్తారో చూడాలి.