అమ్మ వార‌సుడు ఉన్నాడా ..? ఆస్తులు నాకే సొంతం

మొన్న‌టికి మొన్న `మెగాస్టార్ చిరంజీవి కొడుకును నేను` అని ఒక వ్య‌క్తి సృష్టించిన హ‌ల్ చ‌ల్ అంతా ఇంతా కాదు!! ఇప్పుడు తమిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత విష‌యంలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. త‌మిళ‌నాడు రాజ‌కీయాలు సాధార‌ణ స్థితికి చేరుకుంటున్నాయి. కానీ ఉరుము లేని పిడుగులా వ‌స్తున్న `నేను అమ్మ కూతురిని` అని మొన్ననే ఒక యువ‌తి హ‌ల్‌చ‌ల్ చేసింది. ఇప్పుడు `నేను అమ్మ కొడుకుని` అంటూ మ‌రో వ్య‌క్తి తెర‌పైకి వ‌చ్చాడు! ఇన్నాళ్లూ ఎందుకు వీరు ఎక్క‌డున్నారో తెలియ‌దుకానీ.. అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత వస్తున్న వీరిని చూసి అధికారులు, ప్ర‌జ‌లు అయోమ‌యానికి గుర‌వుతున్నారు.

2016 సెప్టెంబర్ 22వ తేదీన తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత.. 72 రోజుల తర్వాత డిసెంబర్ 5న మరణించారు. దాంతో ఒక్కసారిగా తమిళనాడులో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఎన్నో నాట‌కీయ ప‌రిణామాల అనంత‌రం.. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు చ‌క్క‌బడుతున్నాయి! అయితే అక‌స్మాత్తుగా అమ్మ పిల్ల‌లు బ‌య‌టికి వ‌స్తున్నారు. చెన్నైలోని ఈరోడ్ ప్రాంతానికి చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి.. జయలలితకు తానే అసలైన కొడుకునని, తన తల్లిని హత్య చేశారని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.

తాను జయలలిత స్నేహితురాలు వనితామణి ఇంట్లో తనను దత్తత తీసుకున్న తల్లిదండ్రులతో కలిసి ఉంటానని చెప్పారు. తాను 2016 సెప్టెంబర్ 14న చివరిసారిగా జయలలితను పోయెస్ గార్డెన్స్‌లో కలిశానని, అప్పుడు అక్కడే నాలుగు రోజులు ఉన్నానని తెలిపారు. తనను సొంత కొడుకుగా ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని అమ్మ అనుకున్నారని.. అయితే ఈ విషయం శశికళకు తెలియడంతో వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని అన్నారు. సెప్టెంబర్ 22న ఇదే వివాదంలో శశికళ తన తల్లి జయలలితను మేడ మెట్ల నుంచి తోసేసి ఆమెను చంపేశారని తన ఫిర్యాదులో ఆరోపించారు.

ఇవన్నీ బయటపెడితే తన ప్రాణానికి ముప్పు ఉంటుందన్న భయంతోనే తాను ఇన్నాళ్లూ మౌనం వ‌హించాన‌ని, కానీ చివరకు ఎలాగోలా వాస్తవాలను బయటపెట్టాలన్న ధైర్యాన్ని కూడగట్టుకున్నానని కృష్ణమూర్తి చెప్పారు. జయలలితకు ఏకైక కొడుకును తానే కావడంతో.. ఆమె ఆస్తులన్నింటికీ కూడా తానే వారసుడినని ఆయన ప్రకటించుకున్నారు. సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామికి ఈ విషయమై కృష్ణమూర్తి ఓ లేఖ రాశారని తెలుస్తోంది. ఆయన సలహా మేరకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేశారంటున్నారు.