వైసీపీలోకి వైఎస్ ఆప్తమిత్రుడు డీఎల్

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ జ‌గ‌న్ నేతృత్వ‌లోని వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. సీనియ‌ర్ నేత‌లు ఒక్క‌రొక్క‌రుగా జ‌గ‌న్ చెంత‌కు చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే పురందేశ్వ‌రి చేరుతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో తాజాగా మ‌రో సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌, సీమ‌కు చెందిన డీఎల్ ర‌వీంద్రా రెడ్డి కూడా జ‌గ‌న్ పంచ‌కే చేరుతున్న‌ట్టు అధికారికంగా తెలిసింది. ఈ మాట‌ని స్వ‌యంగా డీఎల్ వెల్ల‌డించ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. తాను త్వ‌ర‌లోనే జ‌గ‌న్ పార్టీలోకి చేరుతున్నాన‌ని, జ‌గ‌న్ బాట‌లో న‌డుస్తాన‌ని చెప్పిన డీఎల్‌.. ఆ పార్టీకి విధేయుడిగా ప‌నిచేస్తాన‌ని, త‌న అనుచ‌రులు కూడా జ‌గ‌న్ చెంత‌కే చేరేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా డీఎల్ త‌న‌కు, వైఎస్‌కి మ‌ధ్య ఉన్న స‌న్నిహితంపై ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ నేత‌లు జ‌గ‌న్ ను ఎంత‌గా ఇబ్బంది పెట్టిందీ కూడా వివ‌రించారు. ఇటీవల కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి నేరుగా డీఎల్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. దాంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన వర్గం వైఎస్ వివేకాకే మద్దతు ఇస్తుందని డీఎల్ బహిరంగంగానే ప్రకటించారు. దీంతో డీఎల్ వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం ఇప్పటికే మొదలైంది.. అయితే.. తాజాగా డీఎల్‌ తన వైఖరిని స్పష్టం చేశారు.

జగన్ తనకు ఫోన్ చేసి మాట్లాడారని.. తాను వైసీపీలో చేరబోతున్నానని చెప్పారు. వైసీపీలో తనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని ఆయన తెలిపారు. తాను వైసీపీ వైపు అడుగులు వేస్తున్నట్టుగానే భావించాలని చెప్పారు. తన అనుచరులు కూడా వైసీపీలో చేరడంపై చాలా ఆసక్తిగా ఉన్నారని వెల్లడించారు. వైఎస్ వివేకానందరెడ్డి చర్చలు జరిపిన తర్వాత వైఎస్ జగన్ కూడా నేరుగా ఫోన్ చేశారని డీఎల్ చెప్పారు. అయితే  వివరాలను బయటపెట్టేందుకు డీఎల్ నిరాకరించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు. తాను  వైఎస్ తొలి నుంచి ప్రాణస్నేహితులమని డీఎల్ చెప్పారు.