అక్క‌డ గెలుపు చంద్ర‌బాబుదా..? జ‌గ‌న్‌దా..?

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల త‌రుణంలో క‌డ‌ప గ‌డ‌ప‌లో అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ హోరా హోరీగా త‌ల‌ప‌డుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయా? అన్న రీతిలో శిబిరాలు నిర్వ‌హిస్తున్నాయి. వ‌రుస చ‌ర్చోప‌చ‌ర్చ‌లు.. అధినేత‌ల సూచ‌న‌లు.. వ్యూహ‌ప్ర‌తివ్యూహాలు.. ఇలా ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు త‌ల‌మున‌క‌ల‌వుతున్నారు ! అస్థిత్వాన్ని కాపాడుకేనే ప్ర‌య‌త్నం ఒక‌రిదైతే.. ఎలాగైనా వైసీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లుకొట్టాల‌నే ప్ర‌య‌త్నం వేరొక‌రిది!! మరి ఈ ప్ర‌య‌త్నంలో గెలిచేదెవ‌రు?

క‌డ‌ప రాజ‌కీయంగా వైఎస్ కుటుంబానికి కంచుకోట‌! ఇప్పుడు ఈ కోట‌పై సీఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. రాజ‌కీయంగా ఎక్కువ ల‌బ్ది చేకూరేలా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. పులివెందుల‌కు నీళ్లు ఇచ్చేలా చేసి అక్కడి ప్ర‌జ‌ల‌ను టీడీపీ వైపు తిప్పుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో క‌డ‌ప ఎమ్మెల్సీ ఎన్నిక‌లు రావడంతో ఇది మ‌రింత హీట్ ఎక్కింది. ఈ ఎన్నిక‌ల్లో ఆధిపత్యం సాధిస్తే ఇక తిరుగుండ‌ద‌ని భావిస్తున్నారు చంద్ర‌బాబు. సొంత జిల్లాలో జ‌గ‌న్‌ను నైతికంగా దెబ్బ‌తీసి.. ఇక్క‌డి విజ‌యాన్ని రాష్ట్రమంతా ప్ర‌చారం చేసుకుంటే జ‌గ‌న్‌పై పూర్తి ఆధిపత్యం సాధించిన‌ట్టేన‌ని బాబు యోచిస్తున్నారు. అయితే దీనిని ఎలాగైనా తిప్పి కొట్టాల‌ని జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు.

కడప ఎమ్మెల్సీ పోరును అటు చంద్రబాబు, ఇటు జ‌గ‌న్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నారు. కడపలో తన ఉనికికి వచ్చిన ముప్పేమీ లేదన్నది చాటు కోవాలనుకుంటున్నారు జగ‌న్‌. దీంతో వైసీపీ అభ్యర్థిగా తన చిన్నాన్న వివేకానందరెడ్డిని రంగంలోకి దింపారు. జగన్‌ కుటుంబ సభ్యుడిని ఓడిస్తే జగన్‌ను ఓడించినట్టేనని తెలుగు తమ్ముళ్లు డిసైడయ్యారు.. విజయం కోసం పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీ అభ్యర్థిగా రవీంద్రనాథ్‌రెడ్డిని రంగంలోకి దింపారు కడప జిల్లాలో ఎమ్మెల్సీ ఓటర్లకు సంబంధించి జడ్పీటీసీలు.. ఎంపీటీసీలు, కార్పొరేటర్లు..కౌన్సిలర్లు మొత్తం 854 మంది ఉన్నారు.. వీరిలో వివిధ కారణాల వల్ల కొందరు ప్రస్తుతం జిల్లాలో లేరు. మొత్తంగా 822 మంది ఓటర్లు లెక్క తేలారు.

ఇందులో 400 మందిని ఇటీవల జిల్లా నేతలు సీఎంచంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లారు. వారిలో అందరూ టీడీపీకి ఓటు వేస్తారన్న నమ్మకం తనకు లేదని… టీడీపీ అభ్యర్థిని గెలిపించుకుని వచ్చినప్పుడే విశ్వసిస్తానని చెప్పారట చంద్ర‌బాబు. దీంతో ఆ మాట నిలుపుకునేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శిబిరంలో 426 మంది ఉండగా… ప్రత్యర్థి శిబిరంలో 396 మంది ఉన్నట్టు తెలుస్తోంది.. అయితే టీడీపీ శిబిరంలో ఉన్నవారిలో కనీసం 50మందికి పైగా తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేస్తారని జగన్‌ అనుకుంటున్నారు. మరి ఎవ‌రు గెలుస్తారో వేచిచూడాల్సిందే!!