సీఐడీ ఉచ్చులో ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు

ప్ర‌తిప‌క్ష వైసీపీకి చుక్క‌లు చూపించేందుకు సీఐడీ సిద్ధ‌మ‌వుతోంది. ఒక‌ప‌క్క పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ పావులు కదుపుతున్న విష‌యం తెలిసిందే! మ‌రోప‌క్క ఆ పార్టీ బ‌లంగా ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన‌ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు సీఐడీ ఉచ్చులో చిక్కుకున్నారు.

క‌ల్తీ మ‌ద్యం కేసులో వీరిపై సీబీఐ చార్జిషీటు దాఖ‌లు చేసింది. ఎన్నిక‌ల్లో మ‌ద్యం పంపిణీ చేశార‌ని ఇందులో పేర్కొంది. దీంతో ఏ క్ష‌ణ‌మైనా వీరిని అరెస్టు చేయ‌వ‌చ్చ‌నే ప్ర‌చారం జోరందుకుంది. ఇది వైసీపీలో తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తోంది. వీరిలో గ‌త కొద్ది రోజులుగా టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డిపై విరుచుకుపడుతున్న కాకాని గోవ‌ర్ద‌న్ రెడ్డి కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం!!

ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు క‌ల్తీ మ‌ద్యం ఉచ్చులో చిక్కుకున్నారు. 2014 ఎన్నికల సమయంలో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 32 నకిలీ మద్యం కేసులు న‌మోదయ్యాయి. ఇందులో నెల్లూరు జిల్లాకు సంబంధించి 11 కేసుల్లో సీఐడీ విచారణ పూర్తిచేసింది.

ఇందులో నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి(సర్వేపల్లి), రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌ రెడ్డి (కావలి).. ఎన్నికల్లో కల్తీ మద్యం పంపిణీ చేశారని సీఐడీ నిగ్గుతేల్చింది. కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. గురువారం నెల్లూరు సీఐడీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో వీరితో స‌హా మొత్తం 27 మంది నిందితులుగా ఉన్నట్లు స‌మాచారం.

నకిలీ మద్యం తాగి ఆరుగురు మరణించారు. కర్ణాటక.. గోవా నుంచి గుట్టుగా తెప్పించిన మద్యంలో నాణ్యత సరిగా లేకపోవటంలో మృతి చెందినట్లుగా అప్పట్లో ఆరోపణలు వినిపించాయి.వాస్తవానికి.. కల్తీమద్యం కేసులో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల్నీ అరెస్ట్ చేయాల్సి ఉన్నప్పటికీ.. కోర్టు నుంచి తెచ్చుకున్న స్టే కారణంగా వీరి అరెస్ట్ సాధ్యం కాలేదని చెబుతున్నారు. తాజాగా.. సీఐడీ సేకరించిన ఆధారాలు.. అభియోగాలు ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మెడకు చుట్టుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.