బాల‌య్య వ‌ర్సెస్ చిరు మ‌రో ఫైట్‌

మెగాస్టార్ చిరంజీవి నటించి ఖైదీ నంబర్ 150 – నందమూరి బాలకృష్ణ మూవీ గౌతమి పుత్ర శాతకర్ణి ఈ సంక్రాంతికి పోటాపోటీగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిరుకు 150వ సినిమా కావ‌డంతో పాటు బాల‌య్య‌కు 100వ సినిమా కావ‌డంతో ఈ రెండు సినిమా స‌మ‌రంపై టాలీవుడ్‌లో ఎక్క‌డా లేని ఆస‌క్తి నెల‌కొంది.

ఇదిలా ఉంటే ఈ పోటీ ఇక్కడితో ఆగిపోయేట్లుగా లేదు. ఈ ఇద్ద‌రు అగ్ర హీరోలు ఇప్పుడు ఒకే స్టోరీ కోసం ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఆ స్టోరీ ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి స్టోరీ. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే కథను పరచూరి బ్రదర్స్ ఎప్పుడో సిద్ధం చేసేశారు.

ముందుగా చిరు రీ ఎంట్రీ సినిమా కోసం ఈ క‌థ‌ను ప‌రిశీలించారు. కాని చిరు ప‌దేళ్ల త‌ర్వాత న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో పాటు ఇది హిస్టారిక‌ల్ మూవీ కావ‌డంతో ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న డౌట్‌తో రిస్క్ చేయ‌లేదు. ఇక ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి విష‌యానికి వ‌స్తే 1857లో తొలి స్వతంత్ర సమరం జరిగితే 1847లోనే స్వతంత్ర భారతం కోసం ప్రాణాలు అర్పించిన యోధుడిగా చ‌రిత్ర‌లో నిలిచిపోయాడు.

ఇక ఈ క్ర‌మంలోనే చిరు త‌న 151వ సినిమాగా ఈ స్టోరీతో సినిమా చేయాల‌ని అనుకుంటుంటే…బాల‌య్య సైతం ఇదే పాత్ర‌పై ఆస‌క్తిగా ఉన్నాడ‌ని తెలుస్తోంది. మ‌రి ఫైన‌ల్‌గా ఈ స్వతంత్ర సమరయోధుడి చరిత్రలో ఈ ఇద్ద‌రు హీరోల‌లో ఎవ‌రు న‌టిస్తారో ? అన్న‌ది చూడాలి.