టీడీపీలో మాజీ మంత్రి ర‌చ్చ ర‌చ్చ‌

క‌ర్నూలు టీడీపీలో విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి, నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక‌పోవ‌డంతో త‌మ్ముళ్ల మ‌ధ్య క‌ల‌హాలు బ‌య‌ట‌ప‌డ్డాయి! ముఖ్యంగా కొత్త‌గా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తుండ‌టంతో కొంద‌రు నేత‌లు ఫైర్ అవుతున్నారు. టీడీపీలోకి భూమా నాగిరెడ్డి ఎంట్రీతో కొంత కాలం నుంచి అసంతృప్తితో ఉన్ననంధ్యాల అసెంబ్లీ నియోజ‌వ‌ర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి శిల్పా మోహ‌న్ రెడ్డి తీరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో పార్టీ స‌మ‌న్వయ క‌మిటీ స‌మావేశం ర‌సాభాస‌గా మారింది,

టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి నంద్యాల, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, బనగానపల్లె ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ, బీవీ జయ నాగేశ్వరరెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి గైర్హాజరయ్యారు. డిప్యూటీ సీఎం కేఈ, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జిలు స‌మావేశ‌మ‌య్యారు!ఆరంభం నుంచే సమావేశం హాట్‌.. హాట్‌గా సాగింది,

‘సమన్వయంతో వెళ్లమంటూనే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అత్యంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారు..? మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ను మాట మాత్రంగానైనా పిలవకుండా కలెక్టర్‌.. నంద్యాల పట్టణ రోడ్ల విస్తరణ సమావేశం ఎలా నిర్వహిస్తారు? ఇదేనా సమన్వయమంటే..? పార్టీలో ఉండమంటారా..? వెళ్ళమంటారా..?’ అని శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఫైర్‌ అయ్యారు.

సమన్వయంతో కలిసి పోవాలని చెబుతున్నారుగాని.. ఇదేనా సమన్వయమంటే..? ఎలా కలిసి వెళ్ళాలి? అని ఆయన అన్నారు. ఈ విష‌యాన్ని కేఈ దృష్టికి శిల్పా మోహన్‌రెడ్డి తీసుకువెళ్లారు. నంద్యాల పార్లమెంటుతో తనకే సంబంధం లేదని, కర్నూలు పార్లమెంటు పరిధిలో సమస్యలు వస్తే వాటి పరిష్కారానికి బాధ్యత తీసుకుంటాన‌న్నారు. ఇలా సమన్వయ కమిటీ సమావేశం వేడివేడిగా జరిగినట్లు తెలిసింది.