చిరూకి నాయ‌క‌త్వం క‌న్నా న‌ట‌నే బాగుందా?!

మెగాస్టార్ చిరు విష‌యం ఇప్పుడు ప్ర‌తి నోటా నానుతోంది. ప్ర‌తిష్టాత్మకంగా దూసుకువ‌చ్చిన 150వ మూవీ ఖైదీ హిట్ టాక్ రావ‌డం, దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత కూడా చిరు యాక్టింగ్‌లో ఎలాంటి మార్పూ రాక‌పోవ‌డం, అదే స్టెప్పు, అదే న‌ట‌న‌తో తెలుగు తెర‌ను ఊపేయ‌డం వంటి నేప‌థ్యంలో ఇప్పుడు అంద‌రూ చిరు సంగ‌తులే చ‌ర్చించుకుంటున్నారు. ఇంక‌, చిరు పాలిటిక్స్‌కి ఫుల్ స్టాప్ పెట్టేసిన‌ట్టేనా? అని ప్ర‌తి ఒక్క‌రూ చెవులు కొరుక్కుంటున్నారు. దీనికి స‌మాధానంగా చిరు ఇటీవ‌ల చెప్పిన మాట‌లు క‌నిపిస్తున్నాయి.

ప్ర‌జారాజ్యం పేరుతో 2008లో తిరుప‌తి వేదికగా పార్టీ ప్రారంభించినా.. అనుకున్న విధంగా వ‌ర్క‌వుట్ కాక‌పోయేస‌రికి.. దుకాణాన్ని కాంగ్రెస్‌లో క‌లిపేశారు. ఈ క్ర‌మంలోనే ప‌దేళ్ల‌పాటు ఖాళీ అయిపోయారు. అయితే, ఇటీవ‌ల త‌న‌యుడు చ‌ర‌ణ్ బ్యాన‌ర్‌పై మూవీ తీయ‌డంతో మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కులు త‌న‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారోన‌ని చిరు తెగ ఇదైపోయాడు. కానీ, త‌న అంచ‌నాల‌కు అంద‌నంత‌గా రిజల్ట్ వ‌చ్చింది. దీంతో గ‌తంలో ఎన్న‌డూ లేనంత ఆనందంగా ఉన్నాడు మెగాస్టార్ట్‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ఒప్పుకున్నాడు కూడా.

త‌న 150 చిత్రం విడుద‌ల‌కు ముందు ఎంతో ఆందోళ‌న‌గా ఉండేవాణ్న‌నీ, ప‌దేళ్ల విరామం త‌రువాత ప్రేక్ష‌కులు త‌న‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే టెన్ష‌న్ త‌న‌కు ఉండేద‌ని తాజాగా చెప్పాడు. అయితే, సినిమా విడుద‌ల అయ్యాక ఎప్పుడూ లేనంత ఆనందం అనిపించింద‌న్నాడు. గ‌త ప‌దేళ్ల‌లో లేని ఉత్సాహం ఇప్పుడు ఇంట్లోవారిలోనూ క‌నిపిస్తోంద‌ని చెప్ప‌డ‌మే ఇక్కడి ట్విస్ట్‌! అంటే గ‌డిచిన ప‌దేళ్లుగా చిరు రాజ‌కీయాల్లో ఉంటే త‌న ఇంట్లో వాళ్ల‌కి అది న‌చ్చ‌లేద‌ని ప‌రోక్షంగా చిరు ఒప్ప‌కున్న‌ట్టేగా?!! ఇక‌, రోజంతా సినిమా షూటింగ్‌కి వెళ్లిరావ‌డంలో ఉన్న సంతోష‌మే వేర‌ని స్వ‌యంగా చెప్ప‌డం.. త‌న‌కు కూడా రాజ‌కీయాలు బోర్ కొట్టేశాయ‌ని సిగ్న‌ల్ ఇవ్వ‌డ‌మే.

దీనిని బ‌ట్టి గ‌డ‌చిన ప‌దేళ్లూ రాజ‌కీయాల్లో తాను ఎంత ఉక్కిరిబిక్కిరి అయిపోయానో అని చిరు చెప్ప‌డం ఇప్పుడు అంద‌రినీ ఆలోచింప జేస్తోంది. రాజ‌కీయాల్లో ఇలాంటి ఒత్తిడి ఉంటుంద‌ని ముందుగా చిరంజీవికి తెలీదా..? ఎవ‌రైనా బాగా ఒత్తిడి చేయ‌డం వ‌ల్ల‌నే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాడా.? ఇంత‌కీ ఏం సాదిద్దామ‌న్న ఉద్దేశంతో నాడు ప్ర‌జారాజ్యం స్థాపించిన‌ట్టు..? తాజా వ్యాఖ్య‌లు వింటుంటే… ప్ర‌జాసేవ‌పై ఏమాత్రం క‌మిట్‌మెంట్ లేకుండానే ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావాల‌ని అనుకున్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. ఇప్పుడున్న పొలిటిక‌ల్ ఫీల్ఢ్‌కి.. చిరు లాంటి సౌమ్యుడు ప‌నికిరాడ‌ని తేలిపోయింది! సో.. దీనిని బ‌ట్టి చిరు ఇక‌.. తెర‌కే ప‌రిమిత‌మై పోతాడేమో చూడాలి.