రేవంత్ సొంత కుంప‌టి!

తెలంగాణ టీడీపీలో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆస‌క్తిక‌ర వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. టీడీపీలో సీనియ‌ర్ నేత‌గా ఎదిగిన రేవంత్‌.. తెలంగాణ‌లో ఇప్పుడు ఆపార్టీకి కేరాఫ్‌గా మారార‌న‌డంలో సందేహం లేదు. అయితే, పాలిటిక్స్ అన్నాక.. భూమి గుండ్రంగా ఉండును. అన్న ప‌ద్ధ‌తిలోనే ఉండిపోవు క‌దా! ఈ క్ర‌మంలోనే రేవంత్ కూడా భ‌విష్య‌త్తును అంచ‌నా వేసుకుని.. రాబోయే 2019 ఎన్నిక‌ల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించాల‌ని, మారాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో టీడీపీకి ఆశించిన రాజ‌కీయ వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం లేదు. 2014లో ఉన్న ప‌రిస్థితి కూడా ఇప్పుడు లేదు. ఇక, రాబోయే 2019 ఎన్నిక‌ల నాటికి ఈ ప‌రిస్థితి మ‌రింత క్షీణించినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఈ ప‌రిణామం మొన్నామ‌ధ్య జ‌రిగిన జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా తెలిసింది. దీంతో ఇక‌, ఈ పార్టీనే అంటి పెట్టుకుని ఉండ‌డం వ‌ల్ల లాభం లేద‌ని రేవంత్ డిసైడ్ అయ్యాడ‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో తాను వేరే పార్టీలోకి వెళ్ల‌డ‌మా? లేక సొంతంగా ఇమేజ్ పెంచుకుని.. వేరేగా సొంత కుంప‌టి పెట్టుకోవ‌డ‌మా? అని ఆలోచించి.. చివ‌రికి సొంత కుంప‌టి దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

గ‌త కొన్నాళ్లుగా రేవంత్ అనుస‌రిస్తున్న వైఖ‌రి.. ఆయ‌న సొంతంగా పార్టీ పెట్టుకునేందుకు అనుస‌రిస్తున్న వ్యూహంగానే క‌నిపిస్తోంది. సీఎం కేసీఆర్‌, ఆయ‌న పార్టీపై నిప్పులు చెర‌గ‌డంలో మాస్ట‌ర్ డిగ్రీ ఉన్న రేవంత్‌.. త‌న స్టైల్లో వాళ్ల‌ను విమ‌ర్శిస్తూనే.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అనేక కార్య‌క్ర‌మాల‌ను కూడా చేప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో మ‌ల్ల‌న్న‌సాగ‌ర్‌, జీహెచ్ ఎంసీ రోడ్లు, ప‌క్కాఇల్లు, డ‌బుల్ బెడ్ రూం స‌హాతాజాగా విద్యార్థుల ప‌క్షాన రేవంత్ రోడ్డెక్కారు. వాస్త‌వానికి ఆయ‌న టీడీపీ స‌భ్యుడిగా ఉన్న నేప‌థ్యంలో ఆపార్టీ ఆధ్వ‌ర్యంలోనే ఈ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఆందోళ‌న‌ల‌ను చేప‌ట్టాలి.

కానీ, ఎక్క‌డా రేవంత్ అలా చేయ‌డం లేదు. త‌న ఇమేజ్ పెంచుకునే లా ప్ర‌తి కార్య‌క్ర‌మాన్నీ రూపొందిస్తున్నారు. ప్ర‌తి కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల‌కు, విద్య‌ర్థుల‌కు తానే ద‌గ్గ‌ర‌కావాల‌ని నిర్ణ‌యించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న సొంతంగా పార్టీ పెట్టుకునేందుకే ఇలాంటి వ్యూహం అనుస‌రిస్తున్న‌ట్టు చెబుతున్నారు మేథావులు. మ‌రోప‌క్క‌, రేవంత్ త‌మ‌తో క‌లిసి రావ‌డం లేద‌ని, తాను సొంతంగా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నాడ‌ని తెలంగాణ టీడీపీ నేత‌లు వాపోతున్నారు. నిజానికి రేవంత్ టీటీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. దీంతో అంద‌రినీ క‌లుపుకొని పోవాలి. కానీ, ఇలా సొంత ఇమేజ్ పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వ‌డ‌మే అంద‌రినీ అనుమానించేలా చేస్తోంది. ఏం జ‌రుగుతుందో తెలియాంటే.. కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.