రూ.650 కోట్ల కుంభ‌కోణంలో ఏపీ మంత్రి

ఏపీ మంత్రిపై భారీ ఎత్తున కుంభ‌కోణం ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. రూ.650 కోట్ల కుంభ‌కోణంలో మంత్రి గంటా శ్రీనివాస‌రావు కూరుకుపోయార‌ని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ ఆరోపించారు. అంతేకాదు, దీనిని నిరూపించేందుకు త‌మ వ‌ద్ద సాక్ష్యాలు సైతం ఉన్నాయ‌ని ఆయ‌న చెప్ప‌డం రాష్ట్రంలో సంచ‌ల‌న సృష్టిస్తోంది. నిజానికి రాష్ట్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న గంటాపై గ‌తంలోనూ అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. విద్యాశాఖ‌లో బ‌దిలీల సంద‌ర్భంగా పెద్ద ఎత్తున లాబీయింగ్ జ‌రిగింద‌ని, ఉపాధ్యాయులు తాము కోరుకున్న ప్రాంతానికి బ‌దిలీ అయ్యేందుకు రూ.ల‌క్ష‌ల్లో ముడుపులు చెల్లించుకోవాల్సి వ‌చ్చింద‌ని వార్త‌లు వెలువ‌డ్డాయి.

ఇక‌, పాఠ‌శాల‌ల మౌలిక స‌దుపాయాల విష‌యంలోనూ ఖ‌ర్చుల‌కు, లెక్క‌లు చూపించిన దానికి, బిల్లుల‌కు సంబంధం లేకుండా పోయింద‌ని, భారీ ఎత్తున నిధులు దారిమ‌ళ్లాయ‌ని ఆరోప‌ణ‌లు వినిపించాయి. అప్ప‌ట్లో ఆయా ఆరోప‌ణ‌లు సీఎం చంద్ర‌బాబు స్థాయి వ‌ర‌కు వెళ్లాయి. దీంతో అవినీతిని స‌హించ‌ను అని ప‌దేప‌దే చెప్పే సీఎం చంద్ర‌బాబు.. గంటాపై సీరియ‌స్ అవుతార‌ని అంద‌రూ భావించారు. ఇక‌, ఇప్పుడు తాజాగా సీపీఐ రామ‌కృష్ణ పేల్చిన బాంబ్ మ‌రింత దారుణంగా ఉంది. దాదాపు కోట్ల రూపాయ‌లు విలువ చేసే భూమిని గంటా కొట్టేశార‌ని ఆయ‌న ఆరోపించారు.

రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోంద‌న్న రామకృష్ణ‌.. మంత్రి గంటా 650 కోట్ల విలువైన భూ కుంభకోణానికి పాల్ప‌డ్డార‌ని అన్నారు. జీవో 290 ప్రకారం అసైన్డ్ భూములు ఎవరికీ అమ్మడానికి – కొనడానికి వీల్లేదని, అయినా కూడా.. గంటా మాత్రం రూ. 650 కోట్ల విలువైన అసైన్డ్ భూములు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. దీనిపై సీఎం చంద్ర‌బాబు తక్షణమే విచారణ జరిపించాల‌న్న రామ‌కృష్ణ లేనిపక్షంలో తాము ఆందోళ‌న‌కు దిగుతామ‌ని హెచ్చరించారు. మ‌రి దీనిపై సీఎం చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. మొత్తానికి మ‌రోసారి అవినీతి వ్య‌వ‌హారంలో గంటా పేరు రావ‌డం విప‌క్షంలోనే కాకుండా స్వ‌ప‌క్షంలోనూ చ‌ర్చ‌కు దారితీసింది.