మోడీ డెసిష‌న్‌పై తాజా స‌ర్వే రిజ‌ల్ట్ ఇదే

న‌ల్ల కుబేరుల‌పై క‌రెన్సీ స్ట్రైక్స్‌తో విరుచుకుప‌డిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యానికి తొలి వారం ప‌ది రోజులు దేశ‌ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున మద్ద‌తు ల‌భించింది. సామాన్య ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో ఉన్న దేశంలో కొంద‌రి కోసం అంద‌రూ క‌ష్ట‌ప‌డేందుకు, బాధ‌ప‌డేందుకు సైతం సిద్ధం అయ్యారు. ఇదే విష‌యాన్ని ప‌లు సంద‌ర్బాల్లో ప్ర‌ధాని ఉటంకించారు. కేవ‌లం 0.28%గా ఉన్న న‌ల్ల కుబేరుల కోసం మిగిలిన 99.72% మంది తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రికొంద‌రు బ్యాంకులు, ఏటీఎంల వ‌ద్ద క్యూల‌లో నిల‌బ‌డ‌లేక ప్రాణాలు సైతం కోల్పోయారు.

ఇక‌, నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం సంద‌ర్భంగా న‌వంబ‌రు 8 నాటి ప్రధాని ప్ర‌సంగంలో కేవలం కొద్ది రోజుల్లోనే స‌మ‌స్య మానిపోతుంద‌ని, విధిలేని ప‌రిస్థితిలోనే ఆప‌రేష‌న్ చేయాల్సి వ‌చ్చింద‌ని, కాబ‌ట్టి కొంత నొప్పి ఉంటుంద‌ని, బాధ కూడా ఉంటుంద‌ని, కొన్నాళ్లు ఓర్చుకుంటే న‌వీన భార‌తం ఆవిష్కృతం అవుతుంద‌ని ప్ర‌ధాని మోడీ స‌హా కేంద్ర మంత్రి వెంక‌య్య వంటి వారు పెద్ద పెద్ద ప్ర‌సంగాలు చేశారు. అయితే, దేశంలో పెద్ద నోట్లు ర‌ద్ద‌యి 35 రోజులు అయింది. ఇప్ప‌టికీ ప‌రిస్థితిలో ఎలాంటి మార్పూ రాక‌పోగా.. ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు చిన్న‌నోట్లను అందించ‌డంలో బ్యాంకులు పూర్తిగా విఫ‌ల‌మ‌వుతున్నాయి.

దీంతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయినా కూడా మొన్నామ‌ధ్య ప్ర‌ధాని మోడీ నిర్వ‌హించిన స‌ర్వేలో ఈ ర‌ద్దుకు మ‌ద్ద‌తుగా 99% మంది మ‌ద్ద‌తు తెలిపార‌ని చెప్పుకొచ్చారు. కానీ, తాజాగా లోక‌ల్ స‌ర్కిల్ అనే సంస్థ ఓ స‌ర్వే చేసింది. దీనిలో పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని కేవ‌లం 39% ప్ర‌జ‌లు మాత్ర‌మే స‌మ‌ర్థించ‌డం గ‌మ‌నార్హం. ఇది కేంద్ర ప్ర‌భుత్వానికి చెంప పెట్టులాంటింది. అంటే, దేశంలో 61% శాతం మంది ప్ర‌జ‌లు ఈ నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నార‌ని స‌ర్వేలో వెల్ల‌డైంది.

ఈ స‌ర్వేలో మ‌రో విచిత్రం ఏంటంటే.. స‌ర్వేలో పాల్గొన్న వారిలో కొంత‌మంది మొద‌ట్లో మోడీ స‌ర్కారు నిర్ణయానికి మ‌ద్ద‌తు ఇచ్చిన‌వారు కూడా ఉండ‌డం. దాదాపు 8500 మందిని ప్ర‌శ్నించి ఈ స‌ర్వే నిర్వాహ‌కులు ర‌ద్దు అనంతర ప‌రిణామాల‌పై అన్ని విష‌యాల‌నూ ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించారు. నోట్ల క‌ష్టాల వ‌ల్ల ప్ర‌జ‌లు చాలా అస‌హ‌నంతో ఉన్న విష‌యం ఈ స‌ర్వేలో స్ప‌ష్టంగా వెల్ల‌డైంది.

బ్యాంకుల ముందు రోజుల త‌ర‌బ‌డి క్యూ లైన్లో నిల‌బ‌డ్డా త‌మ‌కు సొమ్ము దొర‌క‌డం లేద‌నీ, దేశంలో కొంత‌మంది బ‌డా బాబుల‌కు మాత్రం కోట్లకు కోట్ల రూపాయ‌ల కొత్త నోట్లు ఎలా దొరుకుతున్నాయ‌నీ, వారికి భారీ మొత్తంలో కొత్త నోట్లు ఏ బ్యాంకులు ఇస్తున్నాయంటూ చాలామంది ఆగ్రహం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ స‌ర్వేపై కేంద్ర స‌చివులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.