జగ‌న్ ప్లాన్ అదిరిపోయింది! 

వైకాపా అధినేత జ‌గ‌న్‌.. తాజాగా తీసుకున్న ఓ నిర్ణ‌యంపై ఇప్ప‌టికి వ‌ర‌కు అసంతృప్తిగా ఫీలైన ఆయ‌న పార్టీ నేత‌ల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 2014లో కొంచెం తేడాతో మిస్స‌యిన సీఎం సీటును ఎట్టిప‌రిస్థితిలోనూ 2019లో సాధించి తీరాల‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్న జ‌గ‌న్‌.. ఆదిశ‌గా అడుగులు వేయ‌డం మొద‌లైంది. ఈ క్ర‌మంలో ఆయ‌న వేసిన ప్లాన్ అదిరిపోయింద‌నే టాక్ వ‌చ్చింది. మొన్న‌మొన్నటి వ‌ర‌కు వైకాపా అంటే.. జ‌గ‌న్‌.. జ‌గ‌న్ అంటే వైకాపా అనే ప‌రిస్థితి మాత్ర‌మే క‌నిపించింది. ఆ పార్టీలో ఎందరు మేధావులు ఉన్న‌ప్ప‌టికీ.. క్రెడిట్ అంతా జ‌గ‌న్ కొట్టేసేవారు. దీంతో నేత‌ల్లో ఒకింత ఆవేద‌న‌, అసంతృప్తి ఉండేది.

దీనిని గ‌మ‌నించిన జ‌గ‌న్‌.. ఇటీవ‌ల కాలంలో తీసుకున్న కొన్ని నిర్ణ‌యాలు పార్టీకి బూస్ట్ పెంచాయ‌ని తెలుస్తోంది. పార్టీలో తాను ఒక్క‌డినే లేను అన్న విష‌యాన్ని జ‌గ‌న్ ఇప్ప‌టికి గ్ర‌హించాడ‌ని అంటున్నారు వైకాపా నేత‌లు. విష‌యం ఏంటంటే.. ఇంత‌కు ముందులా .. పార్టీకి సంబంధించిన కార్య‌క‌లాపాల‌న్నీ తానే కేంద్రంగా కాకుండా సీనియ‌ర్ నేత‌లు కేంద్రాలుగా నిర్వ‌హించాల‌ని జ‌గ‌న్ డిసైడ్ అయ్యాడు. అవ‌డ‌మే కాకుండా.. ఆయా నేత‌ల‌కు ప‌నులు కూడా అప్ప‌గించాడు. ఫ‌లితంగా ఇటు ఆయా నేత‌ల‌కు సంతృప్తితో పాటు.. ప్ర‌జ‌ల్లోకి పార్టీ కూడా పెద్ద ఎత్తున వెళ్తుంద‌ని జ‌గ‌న్ ప్లాన్ చేశాడ‌ని టాక్ న‌డుస్తోంది.

కొద్దికాలం క్రితం జ‌గ‌న్ గ‌డ‌ప గ‌డ‌ప‌కు వైకాపా కార్య‌క్ర‌మాన్నిప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులే కాకుండా స్థానికంగా ఉండే పార్టీ నేతలు కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు వీలు కలిగింది. అంతేకాకుండా ఈ కార్య‌క్ర‌మం ద్వారా సీనియ‌ర్ల‌ను తాను గుర్తిస్తున్నాన‌నే సంకేతాల‌ను జ‌గ‌న్ పంపాడ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న రైతాంగ సమస్యలపైనా ఎక్కడికక్కడ‌ జిల్లాల వారీగా ఉద్యమాలను చేప‌డుతున్నారు. ఈ నెల 4న అనంతపురంలో నిర్వ‌హించిన ధర్నాలో జ‌గ‌న్ నేరుగా పాల్గొన్నారు.

ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా యువతను ఆకర్షించేందుకు వీలుగా యువభేరీలతో జగన్ తన పోరాట దూకుడును పెంచుతున్నారు. విశాఖలోరైల్వే జోన్ కు సంబంధించి ఇప్పటికే ఉద్యమం చేపట్టిన ఆ పార్టీ నాయకత్వం మున్ముందు ప్రాంతాల వారీగా కీలక సమస్యలపై దృష్టిసారించి వాటిపై ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని సమాలోచనలు చేస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపైనా గతంలో ఉద్యమాలు చేసిన ఆ పార్టీ నాయకత్వం మున్ముందు కూడా ఈ వర్గాల సమస్య లపై ప్రత్యేక దృష్టిసారించి ఉద్యమాలను చేపట్టాలని యోచిస్తోంది.

ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే.. పార్టీలో సీనియ‌ర్‌లుగా ఉన్న నేత‌ల‌ను సంతృప్తి ప‌ర‌చ‌డంపైనా జ‌గ‌న్ దృష్టిసారించారు. సదావర్తి సత్రం భూముల వ్యవహారంపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలోని పార్టీ కమిటీ అమ‌రావ‌తి స‌హా త‌మిళ‌నాడులోనూ ప‌ర్య‌టించి వ‌చ్చింది. మరో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విశాఖ రైల్వేజోన్ ఉద్యమంలో పాలుపంచుకుని, భారీ వర్షాలకు పంటనష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు.

మరోవైపు కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి పార్టీ తరపున భూమన కరుణాకర్ రెడ్డి – అంబటి రాంబాబు – బొత్స సత్యనారాయణ మద్దతు తెలుపుతూ ఆ వర్గం మద్దతును పార్టీకి కూడగడుతున్నారు. ఇలా వైకాపా అధినేత జ‌గ‌న్ త‌న స్టైల్‌ను మునుప‌టిక‌న్నా భిన్నంగా మార్చుకుని దూసుకుపోతున్నారు. మ‌రి భ‌విష్య‌త్తులో ఆయ‌న ఆస‌లు ఫ‌లిస్తాయో లేదో చూడాలి.