జంపింగ్ జ‌పాంగ్‌ల‌కు ఫ్యూచ‌ర్ బెంగ‌

అవును! కాంగ్రెస్ నుంచి జంప్ చేసి విచ్చ‌ల‌విడిగా బీజేపీలో చేరిపోయిన సీనియ‌ర్ నేత‌లు ఇప్పుడు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఏపీ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు విరుద్ధంగా తెలంగాణ ఏర్పాటు చేయ‌డంతో ఏపీలో కాంగ్రెస్ అడ్ర‌స్ గ‌ల్లంత‌యింది. దీంతో ఆపార్టీలో ఉంటే త‌మ భ‌విష్య‌త్ కూడా నాశ‌నం అయిపోతుంద‌ని భావించిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు, మంత్రులుగా చేసిన నేత‌లు సైతం కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. మోడీ నేతృత్వంలోని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఫ‌లితంగా త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు భారీ ఎత్తుకు చేరుతుంద‌ని, మ‌రోసారి చ‌క్రం తిప్ప‌వ‌చ్చ‌ని అనుకున్నారు.

ఇలా అనుకున్న‌వారిలో కాంగ్రెస్‌ సీనియర్‌నేత, మాజీ మంత్రి కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు పురందేశ్వరీ, కావూరి సాంబశివరావు, మరోసీనియర్‌ నేత, మాజీ రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మినారాయణ ఇలా పలువురు కాంగ్రెస్‌ నేతలు బీజేపీ జెండా క‌ప్పుకొన్నారు. ఆ స‌మ‌యంలో వీరికి ఇటు టీడీపీ నుంచి అటు వైకాపా నుంచి కూడా ఆహ్వానాలు అందినా.. ఖాత‌రు చేయ‌కుండా బీజేపీలో చేరార‌నే వార్త‌లు వ‌చ్చాయి. దీనివెనుక వారు పెద్ద ప్లాన్ సిద్ధం చేసుకున్నార‌ని తెలిసింది.

న‌రేంద్ర మోడీ నేతృత్వంతో కేంద్రంలో ప్ర‌భుత్వం ఏర్పాటు ఖాయం కాబ‌ట్టి.. ఆ పార్టీకి ఏపీలో పెద్ద కేడ‌ర్, బ‌ల‌మైన నాయ‌కులు లేరుకాబ‌ట్టి.. తాము ఓ వెలుగు వెలిగిపోవ‌చ్చ‌ని, ప్ర‌ధాన ప‌ద‌వులు కొట్టేయొచ్చ‌ని వారు క‌ల‌లు క‌న్నారు. మ‌రోప‌క్క‌, నిజంగానే నాయ‌క‌త్వ లేమితో కొట్టుమిట్టాడుతున్న బీజేపీ.. వ‌చ్చిన వాళ్ల‌ని వ‌చ్చిన‌ట్టు చేర్చేసుకుంది. దీంతో లెక్క‌కు మిక్కిలిగా బీజేపీలో చేరిపోయారు. అయితే, వాళ్లంతా ఇప్పుడు అలో ల‌క్ష్మ‌ణా అని విల‌పిస్తున్న‌ట్టు వారి వారి అనుచ‌రులు చెబుతున్నారు. పార్టీలో చేర్చుకోవ‌డం వ‌ర‌కు బాగానే స్పందించిన బీజేపీ అధినాయ‌క‌త్వం ఇప్పుడు త‌మ‌ను పూర్తిగా ప‌క్క‌కు పెట్టింద‌ని వారు అంటున్నారు.

అంతేకాదు, కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి పెద్ద నోట్ల ర‌ద్దు, ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డం వంటివి త‌మ‌ను పూర్తిగా ఇరుకున పెడుతున్నాయ‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. దీనికితోడు ఇటీవ‌ల త‌న ట్వీట్ల‌తో వేగం పెంచిన జ‌న‌సేనాని ప‌వ‌న్ చేస్తున్న కామెంట్లు మ‌రింత‌గా త‌మ‌ను ఇబ్బంది పెడుతున్నాయ‌ని అంటున్నారు. ఇప్పుడు ప్ర‌జ‌ల్లోకి వెళితే.. పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌ర ప‌రిస్థితుల‌పైనే త‌మ‌ను ప్ర‌శ్న‌లు అడుగుతున్నార‌ని, హోదా విష‌యంలోనూ తాము ఎలా త‌ప్పించుకోవాలో అర్ధం కావ‌డం లేద‌ని అంటున్నారు.

తాము ఏదో భ‌విష్య‌త్తు బాగుంటుంద‌ని కాంగ్రెస్‌ను విడిచి.. బీజేపీలో చేరితే ఇప్పుడు ఇక్క‌డి ప‌రిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో ప‌డిన‌ట్టు అయింద‌ని నేత‌లు వాపోతున్నారు. ఈ క్ర‌మంలో ఏం చేయాల‌ని అని త‌మ‌లో తామే చ‌ర్చించుకుంటున్నార‌ని స‌మాచారం. మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌ల వేడి ర‌గ‌ల‌నుండ‌గా.. ఇప్ప‌టి నుంచి త‌మ ప‌రిస్థితి తాము చ‌క్క‌దిద్దుకోవ‌డంపైనే నేత‌లు దృష్టి పెట్టార‌ని తెలుస్తోంది. దీనికి ఇటీవల విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు ఉదంతం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఎంతో ఆశించి బీజేపీలో చివ‌రికి చివ‌రికి ఇప్పుడు వైకాపా తీర్థం పుచ్చుకున్నాడు. మ‌రి భ‌విష్య‌త్త్తులో ఇంకెంత మంది నేత‌లు ఇలా మార‌తారో చూడాలి .