ఏపీ స‌చివాల‌యంలో మీడియాకు క‌న్నీళ్లే

మీడియాకు, ప్ర‌చారానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు పాలిస్తున్న ఏపీలో అందునా ఏపీ సెక్ర‌టేరియ‌ట్‌లో ఇప్పుడు మీడియా ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఎండ‌కు ఎండుతూ.. వాన‌కు త‌డుస్తూ.. రిపోర్ట‌ర్లు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు.

అటు అధికారులు స‌రే.. ఇటు ప్ర‌భుత్వాధినేత‌లు, ఎమ్మెల్యేలు సైతం ఎవ‌రూ మీడియా రిపోర్ట‌ర్ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించు కోవ‌డం కానీ, ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై దృష్టి పెట్ట‌డం కానీ చేయ‌డం లేదు. దీంతో రిపోర్ట‌ర్లు గంట‌ల త‌ర‌బ‌డి న్యూస్ కోసం స్టాండింగ్ పొజిన్‌లో ఉంటున్న ప‌రిస్థితే క‌నిపిస్తోంది.

పాల‌న‌ను హైద‌రాబాద్ నుంచి ఏపీకి త‌ర‌లించిన సీఎం చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా వెల‌గ‌పూడిలో తాత్కాలిక స‌చివాల‌యాన్ని నిర్మించారు. ఉద్యోగుల‌ను కూడా త‌ర‌లించారు. భారీ ఎత్తున అన్ని స‌దుపాయాల‌తోనూ నిర్మించిన సెక్ర‌టేరియ‌ట్‌పై మీడియా అనేక విశేష క‌థ‌నాల‌ను ప్ర‌చురించింది. పెద్ద ఎత్తున ప్ర‌చారంలోకి తీసుకువ‌చ్చింది. దీనికంత‌టికీ కార‌ణం.. అక్క‌డ ఉన్న విలేక‌రులు, మీడియా వీడియోగ్రాఫ‌ర్లే.

ఈ క్ర‌మంలోనే తాము ఎక్కువ గంట‌ల‌పాటు స‌చివాల‌య ప‌రిధిలోనే ఉంటున్నామ‌ని, అయితే, త‌మ‌కు క‌నీసం కూర్చునేందుకు, వ‌ర్షం వ‌చ్చినా.. ఎండ మాడిపోయినా.. త‌ల‌దాచుకునేందుకు చిన్న షెల్ట‌ర్ కూడా లేద‌ని వారు వాపోతున్నారు.

ఇదే విష‌యాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు స‌హా సీఎం చంద్ర‌బాబుకి సైతం వారు తెలియ‌జేశారు. స‌చివాల‌య ప‌రిధిలో మీడియా పాయింట్ ఏర్పాటు చేసి క‌నీసం తాగు నీరు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేయాల‌ని వారు అభ్య‌ర్థించారు. ఈ క్ర‌మంలో చూస్తాన‌ని చెప్పిన సీఎం చంద్ర‌బాబు ఆ త‌ర్వాత ఈ విష‌యాన్ని విస్మ‌రించారు. ఇక‌, మిగిలిన వాళ్లూ అంతే!

పైగా.. మీడియా అంటే పెద్ద చుల‌క‌న‌గా చూడడం ప్రారంభించారు.దీంతో విలేక‌రులు తీవ్ర ఆవేద‌న‌కు గురవుతున్నారు. స‌చివాల‌యం బీట్ అంటేనే బెదిరిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక‌, ఐఅండ్ పీఆర్ అధికారులు అస్స‌లు ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశారు. ఈ క్ర‌మంలో ఇప్పటికైనా ప్ర‌భుత్వం స్పందించి మీడియాకు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయాల‌ని వారు కోరుతున్నారు.