ఏపీలో బీజేపీ – టీడీపీ మ‌ధ్య కొత్త చిచ్చు

ఏపీకి ప్రత్యేక హోదా మిత్ర‌ప‌క్షాలు అయిన టీడీపీ – బీజేపీ మ‌ధ్య చాలా రోజుల పాటు చిచ్చు రాజేసింది. ప్ర‌త్యేక హోదా అంశంపై ఏపీలో బీజేపీ, టీడీపీ నేత‌లు చాలా రోజుల పాటు స‌వాళ్లు , ప్ర‌తిస‌వాళ్లు విసురుకున్నారు. చివరకు టీడీపీనే ‘ప్యాకేజీ’తో సరిపెట్టుకుని హోదా వేస్ట్ అని తేల్చటంతో అసలు ఈ వివాదం పూర్తిగా సద్దుమణిగిపోయింది. కొద్ది రోజుల వ‌ర‌కు చంద్ర‌బాబుపై ఫైర్ అయిన ఏపీ బీజేపీ నేత‌లు సైతం ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా వార్నింగ్‌తో కాస్త సైలెంట్ అయ్యారు.

ఇప్పుడు అంతా సాఫీగా సాగిపోతుంద‌నుకుంటున్న టైంలో ఇటీవ‌ల ఓ మీడియాలో వ‌చ్చిన స‌ర్వే ఇప్పుడు ఈ రెండు పార్టీల మ‌ధ్య చ‌ల్లారిన నిప్పును రాజేసింది. టీడీపీకి ఇటీవల బాగా ద‌రువేస్తోన్న ఆంధ్ర‌జ్యోతి మీడియాలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే టీడీపీ బంప‌ర్ మెజార్టీతో గెలుస్తుంద‌ని…. చంద్ర‌బాబు వ‌రుస‌గా ఏపీలో రెండోసారి అధికారంలోకి వ‌స్తార‌ని వెల్ల‌డైంది.

షాకింగ్ మ్యాట‌ర్ ఏంటంటే ప్ర‌స్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తే 120 సీట్లు వస్తాయని, తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తే 140 సీట్లు వస్తాయని సర్వే పేర్కొన్న విషయం తెలిసిందే. బీజేపీతో విడిపోతేనే టీడీపీకి లాభం ఉంటుందని సర్వే చెప్పకనే చెప్పింది. ఇది బీజేపీ నేతల ఆగ్రహానికి గురైంది.

ఈ స‌ర్వేపై బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఆంధ్ర‌జ్యోతి స‌ర్వే చంద్ర‌బాబు న‌మ్ముతారా ? లేదా ? అన్న సంగ‌తి చెపితే త‌మ‌దారి తాము చూసుకుంటామ‌న్నారు. ఇక ఈ సర్వే చేసిన ఆంధ్ర‌జ్యోతిని సైతం ఆయ‌న వ‌ద‌ల్లేదు. ఆంధ్ర‌జ్యోతి డ‌బ్బులు తీసుకుని ఈ స‌ర్వే చేసింద‌ని…ఇది కిరాయి సర్వే అని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

ఇప్ప‌టికే కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చినా..ఆ క్రెడిట్ బీజేపీకి రానివ్వ‌డం లేద‌న్న అసంతృప్తి ఏపీ బీజేపీ నేత‌ల్లో ఉంది. ఏపీ బీజేపీలో కీ లీడ‌ర్లు అంద‌రూ చంద్ర‌బాబు చెప్పు చేత‌ల్లోనే ఉంటార‌ని బాబు వ్య‌తిరేక బీజేపీ వ‌ర్గం భావిస్తోంది. ఈ టైంలో ఇలాంటి స‌ర్వేల పేరుతో తెలుగుదేశమే భాజ‌పాకి దూరంగా ఉండాల‌నే అభిప్రాయాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తున్న తీరు ఏపీలో బాబు వ్య‌తిరేక బీజేపీ నేత‌ల‌కు తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తోంది.

ఏదేమైనా ఇప్పుడిప్పుడే చ‌ల్లారుతున్న బీజేపీ-టీడీపీ మంట‌ను మ‌ళ్లీ ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ రాజేసిన‌ట్ల‌య్యింది. కానీ వాస్త‌వంగా రాజ‌కీయ‌వ‌ర్గాల్లో విన‌ప‌డుతోన్న చ‌ర్చ‌ల ప్ర‌కారం చంద్ర‌బాబుకే బీజేపీతో పొత్తు అవ‌స‌రం. అది ఏపీ బీజేపీ నేత‌ల‌కు ఇష్టం ఉన్నా లేక‌పోయినా స‌రే..?