కామ్రేడ్ల‌తో జ‌న‌సేన పొత్తు ఎవ‌రికి లాభం..!

పొలిటిక‌ల్ పార్టీల‌న్నాక పొత్తులు, ఎత్తులు త‌ప్ప‌వు! ఏపీ విష‌యానికి వ‌చ్చే స‌రికి 2019 ఎన్నిక‌లు అత్యంత కీల‌కం. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు త‌న పాల‌న‌కు మార్క్‌గా 2019 ఎన్నిక‌ల‌ను భావిస్తున్నారు. ఇక‌, విప‌క్షం వైకాపా అధినేత జ‌గ‌న్ ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని భావిస్తున్నారు. ఇక‌, 2014లో పురుడు పోసుకున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా త‌న పార్టీ జ‌న‌సేన‌ను అధికారంలోకి తీసుకురావాల‌ని(పైకి చెప్ప‌క‌పోయినా?) య‌త్నిస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఎవ‌రి రేంజ్‌లో వాళ్లు ఎత్తులు, పొత్తులు ప్రారంభించ‌క త‌ప్ప‌దు.

ఇక‌, తాజాగా జ‌రిగిన ఓ ప‌రిణామం ఇప్పుడు జ‌న‌సేన‌ను హాట్ టాపిక్‌గా మార్చింది. రెండు రోజుల కింద‌ట సీపీఐ ఏపీ కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ హైద‌రాబాద్‌లోని జ‌న‌సేన కార్యాల‌యంలో ప‌వ‌న్‌కి నేరుగా క‌లిచి దాదాపు 40 నిమిషాలు చ‌ర్చించారు. వాస్త‌వానికి రామ‌కృష్ణ పొలిటిక‌ల్ లీడ‌ర్ కాబ‌ట్టి ఇరువురి మ‌ధ్య పొలిటిక‌ల్ చ‌ర్చ‌లే జ‌రుగుతాయి. ఈ క్ర‌మంలో అంద‌రూ ఆలోచించారు. 2019 ఎన్నిక‌ల‌పై వీరి మ‌ధ్య చ‌ర్చ‌జ‌రిగిన‌ట్టు ఆఫ్ రికార్డు టాక్‌! అయితే, వీరిమ‌ధ్య ఏపీకి ప్ర‌త్యేక హోదా, నోట్ల రద్దు తర్వాత సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ విధంగా ముందుకెళ్లాలి.. వంటి అంశాలపైనే ఇరువురూ చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

అయితే, 2014లో ఒంట‌రిగా బ‌రిలోకి దిగిన సీపీఐ.. ఒక్క‌సీటు కూడా పొంద‌లేక పోయింది. దీంతో త‌మ‌కు అనుకూలంగా క‌లిసి వ‌చ్చే పార్టీతో పొత్తు పెట్టుకుని సీట్లు సాధించాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే రామ‌కృష్ణ.. ప‌వ‌న్‌తో భేటీ అయిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ప‌వ‌న్ వ్యూహం ఏమిట‌నే విష‌యం వెల్ల‌డికావాల్సి ఉంది. అయితే, ఈ రెండు పార్టీలకు సంబంధించిన కామ‌న్ విష‌యం ఒక‌రిపై ఒక‌రు ఎప్పుడూ విమ‌ర్శ‌లు చేసుకోలేదు. గత 2014 ఎన్నిక‌ల‌ను గ‌మ‌నిస్తే.. ప‌వ‌న్‌.. ఇటు టీడీపీ, ఇటు బీజేపీల‌కు మ‌ద్ద‌తిచ్చాడు.

కానీ, ఇప్పుడు ప‌రిస్తితి మారింది. ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఈ రెండు పార్టీల‌తోనూ ప‌వ‌న్ తీవ్రంగా ఫైట్ చేస్తున్నాడు. ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూల‌తో పోల్చాడు. ఈ నేప‌థ్యంలో 2019లో ఈ రెండు పార్టీల‌తోనూ ప‌వ‌న్ పొత్తు పెట్టుకునే ప‌రిస్థితిలేదు. దీంతో ఆయ‌న మ‌రో ప్ర‌త్యామ్నాయం వైపు మొగ్గాల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే సీపీఐ క‌నిపించింది.

అయితే, ఈ కామ్రెడ్ల పొత్తుతో జ‌న‌సేన‌కి లాభ‌మా? న‌ష్ట‌మా? అనేది మాత్రం స్ప‌ష్టం. జ‌న‌సేన‌ను అండ‌గా ఉంచుకుని సీపీఐ బ‌ల‌ప‌డ‌డం ఖాయం! గ‌తంలో క‌నీసం ఒక్క సీటు కూడా సంపాదించ‌ని ఈ పార్టీ 2019లో క‌నీసం ముగ్గురిని గెలిపించుకోవాల‌ని ప్లాన్ వేసింది. దీంతో ప‌వ‌న్ పార్టీ అండ‌గా అది సాకారం చేసుకోనుంది. మ‌రి ప‌వ‌న్ ప‌రిస్థితి?  ఏం జ‌రుగుతుందో తెలియాలంటే 2019 వ‌ర‌కు వేచి చూడాలి.