ఆయ‌న ఎంట్రీతో ఉత్కంఠ‌గా గుంటూరు పాలిటిక్స్‌

పాలిటిక్స్‌లో ఒక్కో నేత‌కు ఉంటే ప్ర‌జాద‌ర‌ణే డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇదే ఫార్ములాతో దూసుకుపోయేందుకు రెడీ అవుతున్నారు గుంటూరుకు చెందిన గుంటూరు జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌క్కెన మ‌ల్లికార్జున‌రావు. ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర‌ణ ఉంద‌నేది గుంటూరులో ఎవ‌రిని అడిగినా చెప్పేస్తారు. వాస్త‌వానికి గ‌త రెండు ఎన్నిక‌ల్లో ఆయ‌న టైం బాగోక పోవ‌డంతో ఎమ్మెల్యే కాలేక‌పోయారు. 2004లో వినుకొండ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచినా.. 2009లో మాత్రం ఆయ‌న టికెట్‌ను పొంద‌లేక పోయారు.  ఆ త‌ర్వాత 2014 ద‌గ్గ‌ర‌కొచ్చేస‌రికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న అప్ప‌టికి మంచి ఫామ్‌లో ఉన్న వైకాపాకి ద‌గ్గ‌ర‌వ్వాల‌న్నా జ‌గ‌న్ ప‌ట్టించుకోలేద‌ని టాక్‌. దీంతో ఆయ‌న మౌనంగా కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతున్నారు. ఇక‌, ఇప్పుడు రాష్ట్రంలో రాజ‌కీయాలు వేగంగా మారిపోతున్నాయి. 2019 ఎన్నిక‌ల నేప‌థ్యంలో నేత‌లు త‌మ త‌మ భ‌విష్య‌త్ వ్యూహాల్లో మునిగి తేలుతున్నారు. త‌మ‌కు ఏ పార్టీ అనుకూలంగా ఉంటుంది. ఏది త‌మ‌కు టికెట్ ఇచ్చి గెలిపిస్తుంది. అనే కోణంలో నేత‌లు ఆలోచిస్తున్నారు. అదే స‌మ‌యంలో రాష్ట్రంలోని ఏకైక విప‌క్షం వైకాపా కూడా త‌న‌కు అనుకూలంగా ఉండే నేత‌ల‌కు వ‌ల‌విసిరి మ‌రీ చేర్చుకోవాల‌ని యోచిస్తోంది.

ఈ క్ర‌మంలోనే వైకాపా.. మ‌క్కెన‌కు ఆహ్వానం ప‌ల‌కాల‌ని డిసైడ్ అయింద‌ట‌. అయితే, మ‌క్కెన ఆ పార్టీలో చేర‌తారా?  లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది. నిజానికి మ‌క్కెన ఎంట్రీతో గుంటూరు జిల్లా ప‌ల్నాడు పాలిటిక్స్‌లో చాలా మార్పులు జ‌రుగుతాయ‌నే టాక్ వినిపిస్తోంది. గుంటూరు జిల్లాలోని వినుకొండ స‌హా గుర‌జాల, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌క్కెన‌కు మంచి ప‌ట్టుంది. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను పార్టీలో చేర్చుకోవ‌డం ద్వారా ల‌బ్ధి పొందాల‌ని వైకాపా యోచిస్తోంద‌ట‌.

ఇదే జిల్లాలో ప‌ల్నాడులో కాంగ్రెస్ కుటుంబానికి చెందిన‌ కాసు కృష్ణారెడ్డి కుమారుడు వైకాపాలో చేరుతున్నారు. దీంతో మ‌క్కెన ఎంట్రీపైనే అంద‌రూ ఆస‌క్తిగా చూస్తున్నారు. మ‌క్కెన వైకాపాలోకి వ‌స్తే ఆయ‌న వినుకొండ నుంచి పోటీ చేస్తారా ?  మ‌క్కెన వినుకొండ వైకాపా అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగితే …ప్ర‌స్తుతం అక్క‌డ వైకాపా స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఉన్న బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు ప‌రిస్థితి ఏంట‌న్న ప్ర‌శ్న‌ల‌కు ఇప్ప‌టికీ అయితే ఆన్స‌ర్ లేదు. ఏదేమైనా మ‌క్కెన పార్టీ మార్పు ఇప్పుడు గుంటూరు జిల్లాలోని ప‌ల్నాడు ప్రాంతంలో పొలిటిక‌ల్ వాతావ‌ర‌ణాన్ని హీటెక్కిస్తోంది.