అమ‌రావ‌తి కోసం రాజ‌మౌళి డిజైన్లు

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి బాహుబ‌లి సినిమాతో ఇంట‌ర్నేష‌న‌ల్‌గా సూప‌ర్ పాపుల‌ర్ అయ్యారు. బాహుబ‌లి సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.600 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టి తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించేసింది. ఓ తెలుగు చిత్రానికి ఈ స్థాయిలో పేరు రావడం ఇదే మొదటి సారి. బాహుబలి సినిమాలోని మ‌హిష్మ‌తి సామ్రాజ్యం సెట్టింగులు, గ్రాఫిక్స్ అన్ని రాజ‌మౌళి విజ‌న్‌కు నిద‌ర్శ‌నంగా నిలిచాయి.

భార‌తీయ సంస్కృతి, సంప్ర‌దాయాల‌పై రాజ‌మౌళికి ఎంతో ప‌ట్టుంది. రాజ‌మౌళి త‌న డ్రీమ్ ప్రాజెక్టుగా చెపుతోన్న మ‌హాభార‌తాన్ని తెర‌కెక్కిస్తే ఏం రేంజ్‌లో ఉంటుందో ఊహ‌కే అంద‌డం లేదు. ఇప్పుడు రాజ‌మౌళికి ఉన్న ఈ విజ‌న్‌ను ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలో ఉప‌యోగించుకునే ప‌నిలో ఉన్నార‌ట‌.

ఇప్పటికే సింగపూర్, జపాన్ వంటి దేశాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి అమరావతి మాస్టర్ ప్లాన్ ని రెడీ చేసిన చంద్రబాబు అందులో మార్పులు చేర్పులు చేస్తున్నారు. రాజధాని నిర్మాణంలో రాజమౌళి సలహాలు సూచనలు అవసరమని బాబు భావిస్తున్నారట.

ఈ మేర‌కు చంద్ర‌బాబు అమ‌రావ‌తి డిజైన్ల విష‌యంలో రాజ‌మౌళితో చ‌ర్చించాల‌ని సీఆర్డీఏ అధికారులను చంద్రబాబు ఆదేశించారు. కాగా బుధవారం మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, ఇతర అధికారులు రాజ‌మౌళిని క‌లిశారు. వారు గంట‌కు పైగా రాజ‌మౌళితో ఇదే అంశంపై చ‌ర్చ‌లు జ‌రిపారు.

హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణం లో మన సంస్కృతులు ప్రతిభింబించేలా నిర్మించాలనుకుంటున్నట్లు ఆ విషయం లో సలహాలు సూచనలు చేయాలనీ రాజమౌళిని నారాయణ కోరారు. ఈ విషయం లో తన వంతు సహకారాన్ని తప్పకుండా అందిస్తానని రాజమౌళి వారికీ హామీ ఇచ్చార‌ట‌.