క‌ళ త‌ప్పిన న‌ర‌సారావుపేట రాజ‌కీయం

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ఉన్న గుంటూరు జిల్లాలోని న‌ర‌సారావుపేట నియోజ‌క‌వ‌ర్గానికి రాజ‌కీయంగా ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. గ‌తంలో దివంగ‌త మాజీ సీఎం కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి లాంటి ప్ర‌ముఖులు ప్రాథినిత్యం వ‌హించిన ఈ నియోజ‌క‌వ‌ర్గం…టీడీపీ ఆవిర్భావంతో మాజీ మంత్రి, ప్ర‌స్తుత స్పీకర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావుకు కంచుకోట‌గా మారింది. కోడెల అక్క‌డ నుంచి 1983 నుంచి 2004 వ‌ర‌కు వ‌రుస‌గానే గెలుస్తూనే ఉన్నారు. ఆ త‌ర్వాత రెండు ఎన్నిక‌ల్లోను కోడెల ఓడిపోయి, కాసు వెంక‌ట కృష్ణారెడ్డి విజ‌యం సాధించి…కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఆయ‌న మంత్రిగా ప‌నిచేశారు.

ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కోడెల వ‌ర్సెస్ కాసు ఫ్యామిలీ మ‌ధ్య ద‌శాబ్దాల వైరం ఉంది. పేట రాజ‌కీయాల్లో ఈ రెండు ఫ్యామిలీల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది. అలాంటి బ‌ద్ధ శత్రువులు అయిన ఈ రెండు ఫ్యామిలీల పోరుతో పేట రాజ‌కీయం ఎప్పుడూ ర‌స‌వ‌త్త‌రంగా ఉండేది. అయితే కాల‌క్ర‌మంలో ఇప్పుడు ఈ రెండు ఫ్యామిలీలు పేట‌ను వ‌దిలేస్తుండ‌డంతో పేట‌లో స‌రికొత్త రాజ‌కీయ ముఖ‌చిత్రం ఆవిష్కృత‌మ‌వుతోంది.

2014లో కోడెల త‌న కంచుకోట లాంటి న‌ర‌సారావుపేట‌ను వ‌దిలేసి ప‌క్క‌నే ఉన్న స‌త్తెన‌ప‌ల్లి నుంచి పోటీ విజ‌యం సాధించి ప్ర‌స్తుత అసెంబ్లీకి స్పీక‌ర్‌గా ఉన్నారు. న‌ర‌సారావుపేట నుంచి వైకాపా త‌ర‌పున గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి విజ‌యం సాధించారు. కోడెల మాత్రం అటు స‌త్తెన‌ప‌ల్లితో పాటు ఇటు న‌ర‌సారావుపేట‌కు కూడా టీడీపీ బాధ్య‌త‌లు చూస్తున్నారు.

ఇక పేట‌లో కోడెల ఫ్యామిలీకి బ‌ద్ధ శ‌త్రువులుగా ముద్ర‌ప‌డ్డ కాసు ఫ్యామిలీ త్వ‌ర‌లోనే వైకాపాలోకి జంప్ అవుతోంది. కాసు వెంక‌ట కృష్ణారెడ్డి కొడుకు కాసు మ‌హేష్‌రెడ్డి ఈ నెల 16న వైకాపాలో చేర‌నున్న సంగ‌తి తెలిసిందే. కాసు మ‌హేష్‌రెడ్డి వైకాపాలో చేరి ప‌క్క‌నే ఉన్న మ‌రో నియోజ‌క‌వ‌ర్గం గుర‌జాల నుంచి వ‌చ్చే ఎన్నిల్లో పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మేర‌కు జ‌గ‌న్ నుంచి ఆయ‌న హామీ కూడా పొందార‌ని స‌మాచారం. అదే జ‌రిగితే పేట రాజ‌కీయాల్లో బ‌ద్ధ శ‌త్రువులుగా ముద్ర‌ప‌డ్డ ఈ రెండు ఫ్యామిలీలు న‌ర‌సారావుపేట పాలిటిక్స్ నుంచి జంప్ చేసిన‌ట్ల‌వుతుంది.