విజ‌య‌వాడ టీడీపీలో కొత్త ఫైటింగ్‌

ఏపీలో అధికార టీడీపీలో అన్ని జిల్లాల్లోను పార్టీ నాయ‌కుల మ‌ధ్యే అస్స‌లు పొస‌గ‌డం లేదు. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత పార్టీ అధికారంలోకి వ‌చ్చినా నాయ‌కుల మ‌ధ్య మాత్రం అస్స‌లు క్ర‌మ‌శిక్ష‌ణ క‌న‌ప‌డ‌డం లేదు. చంద్ర‌బాబు అంటేనే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు కేరాఫ్ అన్న నానుడి ఉండేది. అయితే ఇప్పుడు టీడీపీలో మాత్రం మునుప‌టి క్ర‌మ‌శిక్ష‌ణ లేదు. ఇక టీడీపీలో పాత నాయ‌కుల‌కు, కొత్త‌గా వైకాపా నుంచి జంప్ చేసిన వారికి అస్స‌లు పొస‌గ‌డం లేదు.

పార్టీ కోసం ప‌దేళ్ల పాటు క‌ష్ట‌ప‌డి పార్టీని తాము అధికారంలోకి తెచ్చామ‌ని…ఏదో స్వ‌ల్ప ఓట్ల తేడాతో తాము ఓడిపోయినంత మాత్రాన త‌మ‌ను ప‌క్క‌న పెట్టేస్తే ఎలా అని నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు ఫైరైపోతున్నారు. నిన్న‌గాక మొన్న పార్టీలోకి వ‌చ్చి త‌మ‌పై పెత్త‌నం చెలాయించాల‌ని చూస్తే స‌హించేది లేద‌ని కూడా వారు హెచ్చ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఏపీ రాజ‌ధానికి కీల‌క పాయింట్ అయిన విజ‌య‌వాడ టీడీపీలో ఇప్పుడు అసంతృప్తి జ్వాలలు ఎగ‌సిప‌డుతున్నాయి.

విజ‌య‌వాడ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీలో కొత్త ఫైటింగ్ జ‌రుగుతోంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఇక్క‌డ ఇన్‌చార్జ్‌గా బుద్ధా వెంక‌న్న ఉన్నారు. ఆయ‌నకు ఎమ్మెల్సీ రావ‌డంతో షేక్ నాగుల్ మీరాకు ఇన్‌చార్జ్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో అక్క‌డ వైకాపా నుంచి విజ‌యం సాధించి జ‌లీల్ ఖాన్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు టీడీపీలోకి వ‌చ్చేశారు. అప్ప‌టి నుంచి జ‌లీల్ ఎమ్మెల్యేగా ఉన్నా పార్టీ ఇన్‌చార్జ్‌గా మాత్రం నాగుల్ మీరానే ఉన్నారు.

తాజాగా టీడీపీ అధిష్టానం నాగుల్ మీరాను నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తొలగించింది. ఆయన స్థానంలో జలీల్ ఖాన్ కు బాధ్యతలు అప్పగించింది. దీంతో మీరాను తొలగించడంపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో టీడీపీలో ఉన్న ముస్లిం నాయ‌కులు ఈ విష‌యంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక నాగుల్ మీరా సైతం పార్టీ త‌నను కూర‌లో క‌రివేపాకులా వాడుకుని వ‌దిలేసింద‌ని ర‌గిలిపోతున్న‌ట్టు తెలుస్తోంది. తాము ఎట్టి ప‌రిస్థితుల్లోను జ‌లీల్‌ఖాన్‌కు స‌హ‌క‌రించేది లేద‌ని వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ నాయ‌కులు తెగేసి చెపుతున్నారు. మ‌రి ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి.